చేయూత పథకం కింద రూ.4,500 కోట్లు: జగన్‌

030820inner jagan
PTI | Updated :August 03, 2020,16:29 IST

అమరావతి: మహిళా స్వయం సాధికారత దిశగా ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. మహిళలకు ఉపాధి కల్పించాలన్న ఉద్దేశంతో ప్రఖ్యాత కంపెనీలతో ప్రభుత్వం అవగాహన ఒప్పందాలు చేసుకుంది. హిందుస్థాన్‌ యూనిలీవర్‌, ఐటీసీ, ప్రొక్టర్‌ అండ్‌ గాంబిల్‌ తదితర కంపెనీలతో సీఎం జగన్‌, ఉన్నతాధికారులు సమావేశమయ్యారు. సీఎం సమక్షంలో పలు అవగాహన ఒప్పందాలపై సంతకాలు చేశారు. అనంతరం సీఎం జగన్‌ మీడియాతో మాట్లాడుతూ.. ఈ నెల 12న వైఎస్‌ఆర్‌ చేయూత పథకం ప్రారంభిస్తామని చెప్పారు. ‘‘వైఎస్‌ఆర్‌ చేయూత పథకం కింద రూ.4,500 కోట్లు ఇస్తున్నాం. 45-60 ఏళ్లలోపు మహిళలకు చేయూతను అందిస్తాం. ఎంపిక చేసిన మహిళలకు ఏటా రూ.18,750 ఇస్తాం. మొత్తంగా ఈ పథకం కింద మహిళలకు నాలుగేళ్లలో రూ.75వేలు అందజేస్తాం. మహిళలకు స్థిరమైన ఆదాయం కల్పించేలా ఉపాధి అవకాశాలు కల్పిస్తాం. ఈ మేరకు ఇటీవల అమూల్‌ సంస్థతో కూడా ఒప్పందం జరిగింది. ప్రభుత్వం సాయంతోపాటు బ్యాంకు రుణాలకు పూచీకత్తు కూడా ఇస్తాం. దాదాపు కోటి మందికిపైగా మహిళలకు చేయూత, ఆసరా అందిస్తాం. ఇప్పటికే 9లక్షల మహిళలకు రూ. 6700 కోట్లు ఆసరా కింద ఇస్తున్నాం. ఏటా రూ. 11వేల కోట్ల చొప్పున నాలుగేళ్లలో రూ.44వేల కోట్లు మహిళలకే అందజేయనున్నాం’’అని సీఎం జగన్‌ తెలిపారు.

సైబర్‌ క్రైమ్‌ను అరికట్టేందుకు కూడా చర్యలు చేపట్టామని సీఎం జగన్‌ తెలిపారు. ఇప్పటికే 18 దిశ పోలీస్‌స్టేషన్లను ప్రారంభించామని చెప్పారు. వేధింపులపై ఎక్కడ ఫిర్యాదు చేసినా దిశ పోలీసులకు కేసు వెళ్తుందన్నారు. వారంలోనే ఛార్జిషీట్‌ నమోదు చేసి కేసు ట్రయల్స్‌ నడుస్తున్నాయని చెప్పారు. ఉద్యోగాల భర్తీ, నామినేటెడ్‌ పోస్టుల్లో సగం మహిళలకే ఇస్తున్నామని పేర్కొన్నారు. ఆగస్టు 15న 30 లక్షల మంది మహిళలకు ఇళ్ల స్థలాలు పంపిణీ చేసేందుకు ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. మహిళలకు ఇంతగా ప్రాధాన్యం ఇస్తున్న ప్రభుత్వం ఇంకొకటి లేదని సీఎం జగన్‌ అన్నారు. 

Source : Eenadu