అసెంబ్లీని రద్దు చేయండి: చంద్రబాబు సవాల్‌

3c446bea a70d 4e9b 8c9b 8246ccbf590b
PTI | Updated :August 03, 2020,16:33 IST

అమరావతి: ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర ప్రజల భవిష్యత్‌ నాశనం చేసే అధికారం ఎవరికీ లేదని తెదేపా అధినేత నారా చంద్రబాబు నాయుడు అన్నారు. రాజధాని సమస్య ఏ ఒక్కరిదో కాదని, ఐదు కోట్ల మంది ప్రజలదని గుర్తు చేశారు. ఏపీ రాజధాని వికేంద్రీకరణపై ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ వైకాపా ప్రభుత్వ తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. అసెంబ్లీని రద్దు చేసి రావాలని, ప్రజల్లో తేల్చుకుందామని ప్రభుత్వానికి సవాల్‌ విసిరారు. ‘‘ఎన్నికల ముందు రాజధాని గురించి చెప్పకుండా ప్రజలను మభ్యపెట్టారు. అధికారంలోకి వచ్చాక మూడు రాజధానులు చేస్తామనడం సరికాదు. ఎలా మోసం చేశారో ఐదు కోట్ల మంది ప్రజలు అర్థం చేసుకోవాలి. మూడు రాజధానుల ఏర్పాటు సరైన నిర్ణయమని భావిస్తే అందరం రాజీనామాలు చేసి ప్రజల వద్దకు వెళ్దాం. 48 గంటలు సమయం ఇస్తున్నా అసెంబ్లీని రద్దు చేయండి. రాజీనామాలు చేయడానికి తెదేపా ఎమ్మెల్యేలు సిద్ధంగా ఉన్నారు. మీరు రాజీనామాలు చేసి రండి.. ప్రజల్లో తేల్చుకుందాం. ప్రజా తీర్పు మూడు రాజధానులకు అనుకూలంగా ఉంటే స్వాగతిస్తాం. నా సవాల్‌ను స్వీకరిస్తారా? ప్రజలకు వెన్నుపోటు పొడుస్తారా?’’అని ప్రభుత్వాన్ని చంద్రబాబు ప్రశ్నించారు. రెండ్రోజుల్లో స్పందించకపోతే మళ్లీ మీడియా ముందుకు వస్తానని వెల్లడించారు.

Source : Eenadu