కరోనా తీవ్రత పెరిగాక చేతులెత్తేశారు: చంద్రబాబు

3c446bea a70d 4e9b 8c9b 8246ccbf590b
PTI | Updated :July 28, 2020,16:28 IST

అమరావతి: కరోనా మహమ్మారిని రాష్ట్ర ప్రభుత్వం మొదటి నుంచి చాలా తేలికగా తీసుకుందని, తీవ్రత పెరిగాక చేతులెత్తేసిందని తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు విమర్శించారు. గుంటూరు జీజీహెచ్‌లో మృతదేహాలు పేరుకుపోయిన పరిస్థితులు బాధాకరమన్నారు. వైరస్‌ ప్రభావం మృతదేహాలపై ఎంతసేపు ఉంటుందో అధ్యయనం చేసి ప్రోటోకాల్‌ ప్రకారం దహన సంస్కారాలు నిర్వహించాలని ప్రభుత్వానికి సూచించారు. ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో ప్రజలు ఎవరికి వారే స్వీయ నియంత్రణ పాటించాలని సూచించారు. అధైర్య పడాల్సిన అవసరం లేదని.. అలాగని నిర్లక్ష్యం వద్దని విజ్ఞప్తి చేశారు. హోం క్వారంటైన్‌, టెలీమెడిసిన్‌పై అవగాహన పెంచాల్సిన అవసరముందన్నారు. ఈ మేరకు చంద్రబాబు తన ట్విటర్‌ ద్వారా ప్రజలకు వీడియో సందేశం పంపారు. 

‘‘ఇటీవల కాలంలో చరిత్రలో ఎప్పుడూ కనీ వినీ ఎరుగని విపత్తు ఈ కరోనా వైరస్‌. అగ్రదేశాలు అమెరికా, యూరోప్‌తోపాటు ప్రపంచంలోని అన్ని దేశాలు ఈ వైరస్‌తో అతలాకుతలం అయ్యే పరిస్థితి వచ్చింది. ఆర్థిక సంక్షోభం ఏర్పడింది. అన్ని విధాలా చాలా సమస్యలు వచ్చి పడ్డాయి. చాలా మంది ఉపాధి కోల్పోయినప్పటికీ ప్రపంచమంతా ఇదే పరిస్థితి నెలకొంది. ప్రజలు ఎవరికి వారే స్వీయ నియంత్రణ పాటిస్తూ ధైర్యంగా ఉంటే విపత్తును ఎదుర్కోవచ్చు. వ్యాక్సిన్‌ వచ్చే వరకు అప్రమత్తత తప్పదు. రోగ నిరోధక శక్తి పెంచుకోవడం సహా మద్యం, ఇతర వ్యసనాలు మానేయాలి. అవసరమైతే తప్ప బయటకు రావొద్దు. ఇలాంటి క్షిష్ట పరిస్థితుల్లో మనందరం ధైర్యంగా ఉండి ముందుకెళ్లడం తప్ప వేరే మార్గం లేదు. ఈ విషయం ప్రతి ఒక్కరూ గుర్తు పెట్టుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది’’ అని చంద్రబాబు ప్రజలకు సూచించారు.

Source : Eenadu