రోజువారీ పరీక్షల్లో రాష్ట్రం అగ్రస్థానం: జగన్‌

28apcm1a
PTI | Updated :July 28, 2020,16:30 IST

అమరావతి: స్పందన కార్యక్రమంపై తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయం నుంచి కలెక్టర్లు, ఎస్పీలతో ఏపీ సీఎం జగన్‌ మోహన్‌రెడ్డి  సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... కరోనా కేసులు ఎక్కువ నమోదవుతున్నా రిపోర్టుల్లో తగ్గించి చూపే ప్రయత్నం చేయడంలేదని స్పష్టం చేశారు. ఇవాళ ఆరువేలకు పైగా కేసులు నమోదైనట్లు అధికారులు చెబుతున్నారని తెలిపారు. రోజూ చేసే పరీక్షల్లో రాష్ట్రం అగ్రస్థానంలో ఉందన్నారు. రోజుకు 50వేలకు పైగా పరీక్షలు చేస్తున్న రాష్ట్రం మనదే అని తెలిపారు. ప్రతి మిలియన్‌కు 31వేలకు పైగా పరీక్షలు చేస్తున్నామని సీఎం అన్నారు. 90 శాతం పరీక్షలు కొవిడ్‌ క్లస్టర్లలోనే చేస్తున్నామన్నారు.

కరోనా విషయంలో అధికారులు, కలెక్టర్లు బాగా పనిచేశారని  సీఎం కితాబిచ్చారు. కొవిడ్‌ వస్తుంది.. పోతుంది, దానితో కలిసి జీవించాల్సిన పరిస్థితి ఏర్పడిందని వ్యాఖ్యానించారు. రాష్ట్రంలో లక్షకు పైగా కేసులు నమోదైనా.. సగం మందికి నయమైందని తెలిపారు. దేశంలో కరోనా మరణాల రేటు 2.5శాతంగా ఉంటే రాష్ట్రంలో 1.06 శాతమని వివరించారు. 85 శాతం మందికి ఇళ్లలోనే నయమైందని సీఎం వెల్లడించారు.

‘‘కొవిడ్‌ రాకుండా జగ్రత్తలు, చికిత్సపై భారీగా ప్రచారం చేయాలి. ప్రతి గ్రామ, వార్డు సచివాలయాల్లో పోస్టర్లు ఉంచాలి. కాల్‌సెంటర్ల పనితీరును అధికారులు నిత్యం పర్యవేక్షించాలి. పరిస్థితి చూసి హోం క్వారంటైన్‌, జిల్లా, రాష్ట్రస్థాయి కొవిడ్‌ కేంద్రాలకు పంపిస్తాం. హోం క్వారంటైన్‌లో ఉన్న కరోనా బాధితులకు వైద్యులు పర్యవేక్షించాలి. విజిట్‌ చేసి మందులు అందుతున్నాయా?లేదా? చూడాలి. కరోనా బాధితుడి  ఆరోగ్యం గురించి ప్రతిరోజూ అడిగి తెలుసుకోవాలి. మనకున్న 80వేల పడకలను సద్వినియోగం చేసుకోవాలి’’ అని సీఎం జగన్‌ సూచించారు.

Source :Eenadu