#ప్రభాస్‌21: ఆ హీరోయిన్‌ అంత డిమాండ్‌ చేస్తోందా?

Deepika550
PTI | Updated :July 14, 2020,16:44 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: ‘‘మహానటి’ సినిమా చూశాను... చాలా బాగుంది మీరు కూడా చూడండి’ అంటూ ప్రముఖ బాలీవుడ్‌ నటి దీపిక పదుకొణె ఇటీవల ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ స్టోరీ‌ పెట్టిన విషయం తెలిసిందే. దీనిని కొంతమంది ‘దీపిక తెలుగు సినిమా చూసిందోచ్‌’ అని అనుకుంటే... మరికొంతమంది దీపిక ప్రభాస్‌ సరసన నటించబోతోంది అని అనుకున్నారు. దానికీ ఓ కారణముందనుకోండి. ప్రభాస్‌ తర్వాతి సినిమాకు ‘మహానటి’ దర్శకుడు నాగ్‌ అశ్విన్‌ దర్శకుడు కావడం. అయితే దీపికను #ప్రభాస్‌21 కోసం సంప్రదించారా లేదా అనే విషయంలోనే స్పష్టత రాలేదు. కానీ ఆ సినిమాకు దీపిక రెమ్యూనరేషన్‌ గురించి బాలీవుడ్‌ మీడియాలో వార్తలొస్తున్నాయి. 

ప్రభాస్‌  - నాగ్‌ అశ్విన్‌ కాంబినేషన్‌లో ఓ పాన్‌ ఇండియా సినిమా రూపొందిస్తామని వైజయంతి మూవీస్‌ ఇప్పటికే ప్రకటించింది. అందరి అంచనాలు అందుకునేలా... వీలైతే దాటేసేలా ఆ సినిమా ఉండబోతోందని చిత్రబృందం చెబుతూ వస్తోంది. మరి అంతటి సినిమాలో బాలీవుడ్‌ నాయిక తప్పనిసరి అని అనుకుంటున్నారు. ఈ సమయంలోనే దీపిక ‘మహానటి’ గురించి మాట్లాడటంతో ఆమెనే హీరోయిన్‌ అనుకోవడం ప్రారంభమైంది. బాలీవుడ్‌ ముచ్చట్లు చూస్తుంటే అదే నిజమయ్యేలా ఉంది. 

సినిమా గురించి ఇప్పటికే చిత్రబృందం దీపికను సంప్రదించిందనే వార్తలూ వినిపిస్తున్నాయి. అయితే పారితోషికం విషయంలో ఇంకా నిర్ణయానికి రాలేదంట. ఇప్పటివరకు తెలుగు పరిశ్రమలో ఓ సినిమా కోసం హీరోయిన్‌కు ఇచ్చిన పారితోషికం కంటే ఎక్కువ దీపిక డిమాండ్‌ చేస్తోందని సమాచారం. దీంట్లో నిజానిజాలు తేలాలంటే.. ప్రభాస్‌ కొత్త సినిమా హీరోయిన్‌ ప్రకటన జరగాల్సిందే. మరోవైపు సినిమాకు సంబంధించిన ప్రీ ప్రొడక్షన్‌ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. ప్రస్తుతం ప్రభాస్‌ ‘రాధే శ్యామ్‌’ సినిమా పనుల్లో ఉన్నాడు. ఆ సినిమా తర్వాత #ప్రభాస్‌21 ఉండబోతోంది.

Source  : Eenadu