ఆగస్టు నుంచి.. గ్రామాల్లో పర్యటిస్తా

Ap main11a 30
PTI | Updated :June 12, 2020,04:38 IST

పథకాలు అందలేదనే ఫిర్యాదులు రాకూడదు
 అర్హులు ఇబ్బంది పడితే అధికారుల్ని బాధ్యుల్ని చేస్తా
 ముఖ్యమంత్రి జగన్‌

ఆగస్టు నుంచి గ్రామాల్లో పర్యటిస్తానని ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి ప్రకటించారు. తమకు పథకాలు అందలేదనే ఫిర్యాదులు అర్హుల నుంచి రాకూడదని, అర్హత ఉన్న వారికి లబ్ధి చేకూరకపోతే అధికారుల్ని బాధ్యుల్ని చేస్తానని హెచ్చరించారు. గ్రామ, వార్డు సచివాలయాలపై గురువారం సీఎం సమీక్షించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ... పింఛన్లు, ఇళ్లపట్టాలు, ఆరోగ్యశ్రీ కార్డు, రేషన్‌కార్డులు తప్పనిసరిగా అర్హులకు అందాలని, తొలుత వాటిపై దృష్టి సారించాలని ఆదేశించారు. ఏదైనా పథకం కోసం దరఖాస్తు చేసుకున్న వెంటనే గుర్తింపు సంఖ్య (అక్‌నాలెడ్జ్‌మెంట్‌ నంబరు) ఇస్తామని... తద్వారా దరఖాస్తు ఏ దశలో ఉందో దరఖాస్తుదారు తెలుసుకోవచ్చని అధికారులు సీఎంకు వివరించారు. అనంతరం జగన్‌ మాట్లాడుతూ పలు సూచనలు, ఆదేశాలు జారీ చేశారు. ఆ వివరాలు...
* 2021 మార్చి నాటికి గ్రామ, వార్డు సచివాలయాలకు సొంత భవనాల నిర్మాణం పూర్తి కావాలి.
* గ్రామ, వార్డు సచివాలయాల్లోని 17,097 పోస్టులతో పాటు, వైద్యశాఖలోని పోస్టుల భర్తీకి ఒకేసారి షెడ్యూలు ఇవ్వాలి.
* వాలంటీర్లకు డిజిటల్‌ పద్ధతుల్లో శిక్షణ ఇవ్వాలి. ఆ శిక్షణను వారు ఎంతమేర అవగతం చేసుకున్నారో తెలుసుకునేందుకు ప్రశ్నావళి పంపించాలి.
* ప్రకటించిన నిర్దేశిత కాల పరిమితిలోగా అర్హులైన లబ్ధిదారులకు ఆయా పథకాలు అందాలి. ఎవరి దరఖాస్తులూ తిరస్కరించొద్దు.
* సాంకేతికతను వినియోగించటమే కాదు.. వచ్చే సమాచారాన్ని విశ్లేషించి, సమీక్షించి పర్యవేక్షించడమూ ముఖ్యమే.
* ఎక్కడా అలసత్వం జరగకుండా చూసుకునేందుకు యంత్రాంగం అవసరం.
* పథకాల లబ్ధిదారుల జాబితాలు, ఏ సేవ ఎన్ని రోజుల్లో అందుతుందనే వివరాలు, ఈ ఏడాదిలో అమలు చేయనున్న పథకాల క్యాలెండర్‌... తదితరాలను గ్రామ వార్డు సచివాలయాల్లో ప్రదర్శించాలి. ఈ మేరకు చర్యలు చేపట్టారా లేదా అనే పరిశీలనను ఈ నెల 20 లోగా పూర్తి చేయాలి.


ప్రవాసాంధ్రుల్ని తీసుకొచ్చేందుకు మరిన్ని విమానాలు కేటాయించండి
 ప్రధానికి సీఎం జగన్‌ లేఖ

ఈనాడు, అమరావతి: వివిధ దేశాల్లో చిక్కుకున్న ప్రవాసాంధ్రుల్ని ఆంధ్రప్రదేశ్‌కు తీసుకొచ్చేందుకు ‘వందే భారత్‌’ మిషన్‌ కింద మరిన్ని విమానాలు కేటాయించాలని, చార్టర్డ్‌ విమానాలు నడిపేందుకూ అనుమతివ్వాలని కోరుతూ ప్రధాని నరేంద్ర మోదీకి ముఖ్యమంత్రి జగన్‌ లేఖ రాశారు. విదేశాల నుంచి ఎంత మంది ప్రవాసాంధ్రులు రాష్ట్రానికి వచ్చినా ఇబ్బంది లేదని, వారిని తీసుకొచ్చే విమానాలు రాష్ట్రంలోని ఏ అంతర్జాతీయ విమానాశ్రయంలో దిగేందుకైనా అనుమతిస్తామని సీఎం పేర్కొన్నారు. ‘వందే భారత్‌ మిషన్‌ కింద ఆంధ్రప్రదేశ్‌కు తక్కువ విమానాలే కేటాయించారు. ఎక్కువ సంఖ్యలో కేటాయిస్తేనే ప్రవాసాంధ్రులు సొంత రాష్ట్రానికి చేరుకోగలరు. ఆయా దేశాల్లోని తెలుగు సంఘాలు... అక్కడ చిక్కుకున్న తెలుగు వారిని ఆంధ్రప్రదేశ్‌కు పంపేందుకు చార్టర్డ్‌ విమానాలు నడిపేందుకు అనుమతి కోరుతున్నాయి. దీనిపై తగిన చర్యలు తీసుకోవాల్సిందిగా ఆయా దేశాల్లోని భారత హై కమిషన్‌లను, విదేశాంగశాఖ అధికారులను ఆదేశించండి’ అని జగన్‌ విజ్ఞప్తి చేశారు.

Source  :Eenadu