కరోనా మరింత తీవ్రమవుతోంది: WHO

Who1 13
PTI | Updated :June 09, 2020,04:38 IST

ప్రపంచవ్యాప్తంగా కరోనా మహమ్మారి పరిస్థితి మరింత తీవ్రతరమవుతోందని ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్‌ఓ) హెచ్చరించింది. ఐరోపా దేశాల్లో కాస్త తగ్గుముఖం పట్టినా ఉభయ అమెరికా ఖండాలు సహా దక్షిణాసియా దేశాల్లో కేసుల సంఖ్య క్రమంగా పెరుగుతోందని తెలిపింది. ప్రపంచవ్యాప్తంగా ఆదివారం నమోదైన కేసుల్లో అత్యధికం కేవలం 10 దేశాల నుంచే ఉన్నాయని సంస్థ చీఫ్‌ టెడ్రోస్‌ అధనోమ్‌ సోమవారం ఆందోళన వ్యక్తం చేశారు. గడచిన 9 రోజుల్లో లక్షకు పైగా కేసులు నమోదైనట్లు పేర్కొన్నారు. ఆదివారం అత్యధికంగా 1,36,000 కేసులు వెలుగులోకి వచ్చినట్లు తెలిపారు.

ఆఫ్రికా దేశాల్లో వైరస్ రోజురోజుకీ పెరుగుతోందని టెడ్రోస్‌ పేర్కొన్నారు. చాలా దేశాల్లో కేసులు వెయ్యికి తక్కువగానే ఉన్నప్పటికీ.. రోజురోజుకీ కొత్త ప్రాంతాలకు విస్తరిస్తోందని తెలిపారు. అయితే, ప్రపంచవ్యాప్తంగా కొన్ని దేశాల్లో వైరస్‌ ప్రభావం క్రమంగా తగ్గుతుండడం ఊరట కలిగిస్తోందన్నారు. కానీ, ఈ దేశాల్లో ప్రజలు ఇక నుంచి ఎంతమేర నిబంధనలకు కట్టుబడి ఉంటారన్నది సవాల్‌గా మారిందన్నారు. అనేక దేశాల్లో సామూహిక నిరసనలు కొనసాగుతుండడం పట్ల విచారం వ్యక్తం చేశారు. వీటి వల్ల ప్రజలు నిబంధనలు అతిక్రమిస్తున్నారని.. ఇది మారోమారు మహమ్మారి విజృంభించేందుకు కారణమవుతుందని హెచ్చరించారు. అమెరికాలో ఆఫ్రో-అమెరికన్‌ జార్జ్‌ ఫ్లాయిడ్‌ మృతి పట్ల ప్రపంచవ్యాప్తంగా వ్యక్తవుతున్న ఆందోళనల నేపథ్యంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. జాతి సమానత్వం దిశగా సాగే పోరాటానికి డబ్ల్యూహెచ్‌ఓ మద్దతు ఉంటుందని టెడ్రోస్‌ హామీ ఇచ్చారు. కానీ, నిబంధనలు పాటిస్తూ నిరసనలు వ్యక్తం చేయాలని కోరారు. 

Source  : Eenadu