గృహ రుణాలపై మధ్యతరగతికి ఊరట

Nirmalabrk1a
PTI | Updated :May 14, 2020,16:34 IST

దిల్లీ: గృహ రుణాలు తీసుకున్న మధ్యతరగతికి ఈ కరోనా కాలంలో కేంద్రం ఊరట కల్పించింది. గృహ నిర్మాణ రంగాన్ని బలోపేతం చేసేందుకు గృహ‌, నిర్మాణ రంగాలకు రూ.70వేల కోట్లు ప్రకటించింది. ఇందులో భాగంగా మే 2017 నుంచి అమలులో ఉన్న మధ్య ఆదాయ వర్గాలకు గృహ రుణాలపై వడ్డీ రాయితీ పథకాన్ని మరో ఏడాది పాటు పొడిగిస్తున్నట్టు కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్‌ వెల్లడించారు. ఈ ఏడాది మార్చి 31 వరకు ఉన్న ఈ పథకంతో 3.3లక్షల మంది లబ్ధి పొందుతుండగా.. దీన్ని 2021 మార్చి 31వరకు పొడిగించడంతో అదనంగా మరో 2.5లక్షల మంది మధ్యతరగతి ప్రజలకు లబ్దిచేకూరనుంది. రూ.6లక్షల నుంచి 18లక్షల లోపు ఆదాయం ఉన్నవారికి ఈ వడ్డీ రాయితీ పథకం వర్తిస్తుందని ఆమె తెలిపారు. ఆత్మనిర్భర్‌ భారత్ అభియాన్‌ కింద ప్రకటించిన భారీ ఆర్థిక ప్యాకేజీ -2 వివరాలను ప్రకటించారు. ఈ సందర్భంగా నిర్మలా సీతారామన్‌ మాట్లాడుతూ.. ‘‘దేశంలో దాదాపు 50లక్షల మంది వీధి వ్యాపారులకు రూ.5వేల కోట్ల రుణ సాయం చేస్తాం. ఒక్కొక్కరికి రూ.10వేలు చొప్పున వర్కింగ్‌ క్యాపిటల్‌ కింద రుణం మంజూరుచేస్తాం.  నెల రోజుల్లో రుణ సదుపాయం అందుబాటులోకి తెస్తాం. చిన్న వ్యాపారులు బ్యాంకుల ద్వారా లావాదేవీలు జరిపితే మరింత రుణానికి అవకాశం. వారి వ్యాపారాన్ని బట్టి బ్యాంకులు మరింత రుణం ఇచ్చే అవకాశం ఉంటుంది’’ అని తెలిపారు. 

అడవుల పరిరక్షణకు ‘క్యాంపా’ పథకం

‘‘అడవుల పరిరక్షణ, మొక్కలు నాటేందుకు కొత్త పథకం తెస్తున్నాం. రూ.6వేల కోట్లతో గిరిజనులకు ఉపాధి కల్పించే ‘క్యాంపా’ తీసుకొస్తున్నాం. వచ్చే నెల రోజుల్లో ‘క్యాంపా’ పథకం ప్రారంభమవుతుంది. దీని ద్వారా గిరిజనులకు నగదు అందుబాటులోకి వస్తుంది. ఈ పథకాన్ని చిన్న పట్టణాల్లోనూ వినియోగించుకోవచ్చు. రాష్ట్ర ప్రభుత్వాల విచక్షణపై దీని అమలు ఆధారపడి ఉంటుంది’’ అన్నారు.

వలస కార్మికులకు తక్కువ అద్దెతో గృహాలు 
‘‘వలస కార్మికులు, పట్టణ పేదల కోసం స్వల్ప అద్దె గృహాల నిర్మాణానికి కొత్త పథకం తీసుకొస్తున్నాం. పట్టణ, పేదలు, వలస కూలీలకు అందుబాటులో ఉండేలా పీపీపీ పద్ధతిలో గృహాల నిర్మాణం చేపడతాం. రాష్ట్ర ప్రభుత్వాలు ఈ పథకాన్ని చేపడితే తగిన సాయం కేంద్రం అందిస్తుంది. వలస కార్మికులకు ఇబ్బంది లేకుండా ప్రధాని ఆవాస్‌ యోజన కింద నూతన పథకం తెస్తాం. భూమి ఉన్నవాళ్లు ముందుకొస్తే తగిన సాయం చేసేందుకు కేంద్రం సిద్ధంగా ఉంది’’ అని వివరించారు.

Source : Eenadu