సచిన్‌ తప్పు చేసేంతవరకూ ఎదురుచూసే వాళ్లం

Sachin pollock
PTI | Updated :April 14, 2020,18:02 IST

జోహెనస్‌బర్గ్‌: తన తరంలో క్రికెట్‌ దిగ్గజం సచిన్‌ తెందూల్కర్‌ అత్యుత్తమ బ్యాట్స్‌మన్‌ అని దక్షిణాఫ్రికా మాజీ పేసర్‌ షాన్‌ పొలాక్‌ అన్నాడు. తాజాగా స్కైస్పోర్ట్స్‌తో పొలాక్‌ మాట్లాడుతూ.. తాము క్రికెట్‌ ఆడేటప్పుడు లిటిల్‌ మాస్టర్‌ను ఔట్‌చేయడానికి దక్షిణాఫ్రికా టీమ్‌ ఎలాంటి ప్రణాళికలు రూపొందిచేది కాదని పేర్కొన్నాడు. సచిన్‌ తప్పు చేసేంతవరకూ ఎదురుచూసే వాళ్లమని తెలిపాడు. అలాగే పరిస్థితులకు తగ్గట్టు ఆడటంలో మాస్టర్‌ బ్లాస్టర్‌ ఆరితేరాడని, చాలా త్వరగా ఆటను అర్థం చేసుకుంటాడని కొనియాడాడు. 

సచిన్‌ వన్డేల్లో పొలాక్‌ బౌలింగ్‌లో తొమ్మిది సార్లు ఔటయ్యాడు. దీంతో సచిన్‌ను అత్యధికసార్లు ఔట్‌చేసిన బౌలర్ల జాబితాలో పొలాక్‌ నాలుగో స్థానం సంపాదించాడు. ఇక, లిటిల్‌ మాస్టర్‌ అంతర్జాతీయ క్రికెట్‌లో వంద శతకాలు బాదిన బ్యాట్స్‌మన్‌గా రికార్డు సృష్టించిన సంగతి తెలిసిందే. 

అలాగే వెస్టిండీస్‌ మాజీ పేసర్‌ మేఖేల్‌ హోల్డింగ్‌ మాట్లాడుతూ తన సహచర ఆటగాడు, దిగ్గజ బ్యాట్స్‌మన్‌ సర్‌ వివ్‌రిచర్డ్స్‌ క్రికెట్‌ చరిత్రలోనే అత్యుత్తమ బ్యాట్స్‌మన్‌ అని పేర్కొన్నాడు. వివ్‌రిచర్డ్స్‌ ప్రపంచంలో ఏ బౌలర్‌కు బెదరలేదని చెప్పాడు. న్యూజిలాండ్‌ బౌలర్‌ రిచర్డ్‌ హాడ్లీ, ఆస్ట్రేలియా పేసర్‌ డెన్నిస్‌ లిల్లీ, పాకిస్థాన్‌ బౌలర్‌ అబ్దుల్‌ ఖాదిర్‌, భారత బౌలర్‌ బిషన్‌ సింగ్‌ బేడీ, ఇంగ్లాండ్‌ బౌలర్‌ ఇయాన్‌ బోథమ్‌.. వీరందరిపై విండీస్‌ దిగ్గజం ఆధిపత్యం చెలాయించాడని మైఖేల్‌  గుర్తుచేసుకున్నాడు.

Source : Eenadu