ఖాళీ స్టేడియాల్లో కోహ్లీ ఎలా ఉంటాడో?

2 2395
PTI | Updated :April 14, 2020,17:56 IST

సిడ్నీ: మైదానంలో దూకుడుగా ఉండే టీమ్‌ఇండియా సారథి విరాట్‌ కోహ్లీని ప్రేక్షకులు లేకుండా నిర్వహించే మ్యాచ్‌లో చూడటం భిన్నంగా ఉంటుందని ఆస్ట్రేలియా స్పిన్నర్‌ నాథన్‌ లైయన్‌ అన్నాడు. ఖాళీ స్టేడియాల్లో భారత్×ఆసీస్‌ మధ్య టెస్టు సిరీస్‌ నిర్వహిస్తే ఎలా ఉంటుందని ఆసీస్‌ పేసర్‌ మిచెల్‌ స్టార్క్‌తో కలిసి లైయన్‌ చర్చించాడు. ‘‘ఎలాంటి పరిస్థితులకు అయినా కోహ్లీ అలవాటు పడగలడు. అయితే ప్రేక్షకులు లేకుండా కోహ్లీని చూడటం అద్భుతంగా ఉంటుందని స్టార్క్‌, నేను మాట్లాడుకున్నాం. అలా చూడటం కాస్త భిన్నంగా ఉంటుంది. కోహ్లీ సూపర్‌ స్టార్. అతడు ఎలాంటి వాతావరణంలోనైనా రాణించగలడు’’ అని లైయన్‌ పేర్కొన్నాడు.

క్రికెట్‌ ప్రపంచంలో భారత్‌ పవర్‌హౌస్‌ వంటిదని లైయన్‌ కొనియాడాడు. టీమ్‌ఇండియాతో సిరీస్‌ అంటే మరో యాషెస్ వంటిదని, స్వదేశంలో టెస్టు సిరీస్‌ పోరు కోసం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నాని తెలిపాడు. గతంలో తమ జట్టుని కోహ్లీసేన ఓడించిందని, అయితే అప్పటితో పోలిస్తే ఇప్పుడు జట్టు పటిష్ఠంగా ఉందని పేర్కొన్నాడు. కరోనా దృష్ట్యా స్టేడియంలో ప్రేక్షకులు లేకుండా మ్యాచ్‌లు నిర్వహించాలని వైద్యాధికారులు సూచిస్తే పాటిస్తామని అన్నాడు. ప్రస్తుత పరిస్థితుల్లో మ్యాచ్‌లు నిర్వహణపై ఆటంకాలు కలుగుతుండటంతో ఐసీసీ టెస్టు ఛాంపియన్‌షిప్‌ ఫైనల్ షెడ్యూల్‌పై సందేహాలు మొదలయ్యాయి. దీనిపై స్పందిస్తూ ఫైనల్‌లో తమ జట్టు ఉండాలని కోరుకుంటున్నాని, వాయిదాపై నిర్ణయాలు ఐసీసీ పెద్దలు తీసుకుంటారని వెల్లడించాడు.

Source  : Eenadu