అతడే అమలాపాల్‌ ప్రియుడు!

Amalapa
PTI | Updated :April 14, 2020,18:07 IST

ప్రేమ కోసం ఎంతటి త్యాగానికైనా సిద్ధపడేది తల్లి మాత్రమే. కానీ నాకోసం ఉద్యోగాన్నే వదిలేసి అతను కూడా త్యాగం చేయగలనని నిరూపించాడు. అంతేకాక నాకు ఎంతో ఇష్టమైన ఈ రంగంలో నాకు అండగా నిలబడి ప్రేమను చాటుకున్నాడు’ ఈ మాటలు అంటోంది ఎవరో కాదు హీరోయిన్‌ అమలాపాల్‌. గత కొంతకాలంగా అమల ఎవరితోనో ప్రేమలో ఉన్నట్లు వార్తలు వచ్చాయి. వీటిపై స్పందించిన కేరళ బ్యూటీ ఇది నిజమేనని అంగీకరించినప్పటికీ, అతని పేరు చెప్పడానికి మాత్రం ఇష్టపడలేదు. అంతేకాక ప్రియుడి వివరాలను, వారి షికార్లను కూడా గుట్టుగా దాస్తూ వచ్చింది. ఇకపోతే అమల బాయ్‌ఫ్రెండ్‌ ఎవరో తెలిసిపోయిందోచ్‌ అని సోషల్‌ మీడియా కోడై కూస్తోంది. ఈ మేరకు కొన్ని ఫొటోలు విస్తృతంగా చక్కర్లు కొడుతున్నాయి. ఇందులో బుర్కా ధరించి ఉన్న అమల వెంట ముంబై సింగర్‌ భవ్నీందర్‌ సింగ్‌ ఉన్నాడు.

దీంతో అతని కోసం నెటిజన్లు అన్వేషించగా వారి మధ్య కుచ్‌ కుచ్‌ హోతా హై అన్నది బోధపడుతూ వచ్చింది. దీనికి కారణం గతంలోనూ భవ్నీందర్‌ ఆడై సినిమా ప్రమోషన్ల సమయంలో.. నా ప్రేయసిని చూసి గర్వపడుతున్నాను. మున్ముందు కూడా ఇలాగే నీ సినిమాలతో ప్రేక్షకులకు వినోదాన్ని అందించు’ అని ఇన్‌స్టాగ్రామ్‌లో రాసుకొచ్చాడు. కొన్నిసార్లు వీళ్లిద్దరూ కలిసి దిగిన ఫొటోలను సైతం పంచుకున్నాడు. తాజాగా అతను షేర్‌ చేసిన ఫొటో ఈ వార్తలకు మరింత బలాన్నిచ్చింది. అందులో అతను పై నుంచి ఫొటో తీస్తుండగా ఓ యువతి అతన్ని ముందునుంచి హత్తుకుని ఉంది. కానీ ఆమె ముఖం మాత్రం కనిపించకుండా జాగ్రత్తలు తీసుకున్నాడు. అయితే ఆమె కచ్చితంగా అమలాపాలే అని నెటిజన్లు డిసైడ్‌ అయిపోతున్నారు. కాగా ఈ మధ్యే ఈ ప్రేమ జంట బాలి ట్రిప్‌కు వెళ్లారని సమాచారం. ఇక దర్శకుడు విజయ్‌ను ప్రేమించి పెళ్లి చేసుకున్న ఈ హీరోయిన్‌ రెండేళ్లకే అతని నుంచి విడాకులు తీసుకుంది.

Source : Sakshi