కరోనాపై పోరుకు గావస్కర్‌, పుజారా సాయం

3 2138
PTI | Updated :April 07, 2020,18:52 IST

ముంబయి: భారత మాజీ క్రికెటర్‌, ప్రముఖ వ్యాఖ్యాత సునిల్ గావస్కర్‌ తన ఉదారతను చాటుకున్నాడు. కరోనా వైరస్‌పై చేస్తున్న పోరాటానికి తన వంతుగా రూ.59 లక్షలు విరాళంగా ఇచ్చాడు. దీనిలో రూ.35 లక్షలు పీఎంకేర్స్‌కు, రూ.24 లక్షలు మహారాష్ట్ర ముఖ్యమంత్రి సహాయనిధికి అందించాడు. ఈ విషయాన్ని మాజీ ముంబయి సారథి అమోల్‌ ముజుందార్‌ వెల్లడించాడు. ‘‘కరోనాపై పోరుకు సునిల్ గావస్కర్‌ రూ.59 లక్షలు సాయం చేశాడు. రూ.35 లక్షలు పీఎంకేర్స్‌కు, రూ.24 లక్షలు మహారాష్ట్ర సీఎం సహాయనిధికి ఇచ్చాడు’’అని ట్వీట్‌ చేశాడు.

టీమ్‌ఇండియా బ్యాట్స్‌మన్‌ చెతేశ్వర్‌ పుజారా కూడా కరోనాపై పోరుకు సాయం చేశాడు. అయితే సాయం చేసిన మొత్తాన్ని ప్రకటించలేదు. ‘‘కరోనాపై చేస్తున్న పోరాటానికి మా వంతుగా నేను, నా కుటుంబం పీఎం కేర్స్‌, గుజరాత్‌ సీఎం సహాయనిధికి సాయం చేశాం. మీరు కూడా విరాళాలు ఇస్తారని ఆశిస్తున్నా. ప్రతి సాయం ఎంతో విలువైనది. అందరం కలిసి పోరాడితే మహమ్మారిపై విజయం సాధించగలం. దేశం కోసం కరోనాపై ధైర్యంగా, అంకిత భావంతో ముందుండి పోరాడుతున్న వైద్య సిబ్బంది, పోలీసులు, కిరాణ సిబ్బంది, ఇతరులకు ధన్యవాదాలు’’ అని పుజారా తెలిపాడు.

Source : Eenadu