ఫేస్‌బుక్‌ ఉద్యోగికి కరోనా..

066
PTI | Updated :March 05, 2020,19:08 IST

ఇంటి వద్ద నుంచి పనిచేయటానికే మొగ్గు

సియాటెల్‌: ప్రపంచ వ్యాప్తంగా శరవేగంగా వ్యాప్తిస్తున్న కరోనా వైరస్‌ (కొవిడ్‌-19) అమెరికాలోని ఫేస్‌బుక్‌ కార్యాలయంలో ఓ ఉద్యోగికి సోకింది. ఈ సంస్థకు సంబంధించినంత వరకూ ఇదే తొలి కేసు అని ఫేస్‌బుక్‌ అధికారులు ప్రకటించారు. కరోనా సోకిన ఆ ఉద్యోగి సియాటెల్‌లోని ఫేస్‌బుక్‌ ‘స్టేడియం ఈస్ట్‌’ కార్యాలయంలో ఫిబ్రవరి 21 వరకూ విధులు నిర్వహించారు. ఈ నేపథ్యంలో తమ సియాటెల్‌ కార్యాలయాన్ని మార్చి 9వ తేదీ వరకూ మూసివేయనున్నట్లు ఫేస్‌బుక్‌ ప్రకటించింది. అంతేకాకుండా ఈ నెలాఖరు వరకూ ఇంటి నుంచే పనిచేయాల్సిందిగా ఆ కార్యాలయ ఉద్యోగులను కోరింది. ప్రతి ఒక్కరి ఆరోగ్యం, భద్రతకు తాము ప్రాధాన్యమిస్తామని... ఈ క్రమంలో వైద్యాధికారుల సలహాలు, సూచనలను పాటిస్తామని సంస్థ తెలిపింది. 
ఆన్‌లైన్‌ దిగ్గజాలైన గూగుల్, అమెజాన్‌లలో ఒక్కో ఉద్యోగికి కరోనావైరస్‌ సోకిన సంగతి తెలిసిందే. గూగుల్ జ్యురిచ్‌ కార్యాలయంలోని ఓ ఉద్యోగి, సియాటెల్‌లోనే ఉన్న అమెజాన్‌ ఉద్యోగి కూడా ఈ వ్యాధి బారిన పడ్డారు. కరోనావైరస్‌ వ్యాప్తి నేపథ్యంలో అమెజాన్‌, గూగుల్‌, కాయిన్‌బేస్‌, ట్విటర్‌, మైక్రోసాఫ్ట్‌లతో సహా వివిధ టెక్నాలజీ కంపెనీలు తమ ఉద్యోగులతో ఇంటి వద్ద నుంచి పనిచేయించుకొనేందుకు మొగ్గుచూపుతున్నాయి. 

Source : Eenadu