రివ్యూ: లోకల్‌ బాయ్‌

28brklocalboy 1
PTI | Updated :February 28, 2020,17:34 IST

చిత్రం: లోకల్‌ బాయ్‌

నటీనటులు: ధనుష్‌, స్నేహా, మెహరీన్‌, నవీన్‌చంద్ర, నాజర్‌, మనోబాలా తదితరులు

సంగీతం: వివేక్‌-మెర్విన్‌

సినిమాటోగ్రాఫర్‌: ఓం ప్రకాశ్‌

ఎడిటింగ్‌: ప్రకాశ్‌ మబ్బు

నిర్మాణ సంస్థ: సత్యజ్యోతి ఫిల్మ్స్‌

నిర్మాతలు: సెంథిల్‌ త్యాగరాజన్‌, అర్జున్‌ త్యాగరాజన్‌

రచన, దర్శకత్వం: ఆర్‌.ఎస్‌. దురై సెంథిల్‌కుమార్‌

విడుదల తేదీ: 28-02-2020

తమిళంలో స్టార్‌ కథానాయకుడు ధనుష్‌. గత కొంతకాలంగా ఆయన నటించిన చిత్రాలు తెలుగులోనూ విడుదలవుతున్నాయి. ఇటీవల ఆయన ద్విపాత్రాభినయంలో నటించిన తమిళ చిత్రం ‘పటాస్‌’. సంక్రాంతి కానుకగా తమిళంలో విడుదలైన ఈ చిత్రం మంచి టాక్‌ను అందుకుంది. ఇప్పుడు ఇదే చిత్రాన్ని తెలుగులో ‘లోకల్‌ బాయ్’ పేరుతో ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చారు. ధనుష్‌-దురై సెంథిల్‌ కాంబినేషన్‌లో వచ్చిన ‘ధర్మయోగి’ పొలిటికల్‌ థ్రిల్లర్‌గా తెలుగు ప్రేక్షకులను అలరించింది. ఈ నేపథ్యంలో తాజా చిత్రంపైనా మంచి అంచనాలు ఉన్నాయి. పైగా ధనుష్‌ ఇందులో మార్షల్‌ ఆర్ట్స్‌ నిపుణుడిగా కనిపించడం ఆసక్తిని రేకెత్తించింది. ఇందులోని పాత్ర కోసం ధనుష్‌తోపాటు స్నేహా కూడా మార్షల్‌ ఆర్ట్స్‌లో శిక్షణ తీసుకున్నారు. మరి శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం ఎలా ఉంది? ధనుష్‌ ద్వితపాత్రాభినయంతో ఎలా అలరించారు? ఇక్కడి ధనుష్‌ అభిమానుల్ని అలరించిందా..?

కథేంటంటే: కన్యాకుమారి (స్నేహా), ఆమె కుమారుడు శక్తి(ధనుష్‌)లపై కొందరు విదేశీయులు దాడి చేస్తారు. దీంతో ఆమె విదేశీయులపై తిరిగి దాడి చేస్తుంది. ఈ ఘటన పోలీసుల దృష్టికి వెళ్లడంతో కన్యాకుమారిని అరెస్టు చేసి.. పదహారేళ్లు జైలు శిక్ష విధిస్తారు. గాయాలపాలైన శక్తిని ఓ చిల్లర దొంగ పెంచి పెద్దవాడిని చేస్తాడు. ఒకరోజు శక్తి తన స్నేహితుడితో కలిసి బాక్సింగ్‌ అకాడమీలో దొంగతనం చేస్తాడు. అందులో నిలాన్‌ (నవీన్‌ చంద్ర) సాధించిన ట్రోఫీలు కూడా ఉంటాయి. తన ట్రోఫీలు దొంగతనానికి గురి కావడాన్ని నిలాన్‌ సహించలేకపోతాడు. పోలీసులకు ఫిర్యాదు చేస్తాడు. మరోపక్క పదహారేళ్లు శిక్ష అనుభవించిన కన్యాకుమారి జైలు నుంచి విడుదల అవుతుంది. నిలాన్‌ను చంపాలనే పగతో అతడ్ని వెంబడిస్తూ ఉంటుంది. కన్యాకుమారి చేసిన దాడి నుంచి నిలాన్‌ తృటిలో తప్పించుకుంటాడు. దీంతో ఆమెను చంపేందుకు మనుషులను పంపిస్తాడు. నిలాన్‌ నుంచి తప్పించుకునే క్రమంలో కన్యాకుమారి తన కుమారుడు శక్తిని చూస్తుంది. కన్యాకుమారియే తన తల్లి అని తెలుసుకున్న శక్తికి ఆమె ద్వారా తండ్రి తిరవియపెరుమాల్‌ (ధనుష్‌) జీవితం, గతం తెలుస్తాయి. అసలు తిరవియపెరుమాళ్‌ ఎవరు?, నిలాన్‌ను చంపాలని కన్యాకుమారి ఎందుకు అనుకుంటుంది?  తదితర విషయాన్ని తెరపైనే చూడాలి.

ఎలా ఉందంటే: ‘ధర్మయోగి’ వంటి హిట్‌ తర్వాత దురై సెంథిల్‌-ధనుష్‌ కాంబినేషన్‌లో వచ్చిన రెండో చిత్రమిది. ఈ చిత్ర కథను కూడా సెంథిల్‌ రాయడం మరో విశేషం. ఇదొక రివేంజ్‌ డ్రామా. తండ్రిని అతని స్నేహితుడే చంపేయడం.. తల్లీబిడ్డలు ప్రాణాలతో బయటపడటం.. పిల్లవాడు పెరిగి పెద్దయ్యాక గతం తెలుసుకుని తన తండ్రిని చంపిన వాడిపై కొడుకు పగ తీర్చుకోవడం.. ఈ ఫార్ములాతో చాలా సినిమాలు వచ్చాయి. కాకపోతే ఈ కథకు అడిమురై అనే సంప్రదాయ యుద్ధకళను జోడించారు. తమిళనాడులోని ప్రాచీన యుద్ధ కథ ఇది. అన్ని మార్షల్‌ ఆర్ట్స్‌ దీని నుంచే వచ్చాయని సినిమాలో చూపించారు. ప్రథమార్ధమంతా శక్తి, అతని స్నేహితుడితో కలిసి చేసే చిల్లర దొంగతనాలు, శక్తి-సదానా మధ్య సన్నివేశాలు, నిలాన్‌ను చంపేందుకు కన్యాకుమారి ప్రయత్నించడం తదితర సన్నివేశాలతో సాగుతుంది. విరామ సన్నివేశాల వరకూ కథలో ఎలాంటి మలుపులు ఉండవు. ధనుష్‌-మెహరీన్‌ల మధ్య కెమిస్ట్రీ పండలేదు. ఎప్పుడైతే కన్యాకుమారి తన తల్లి అని శక్తికి తెలిసిందే అప్పుడే కథ కీలక మలుపు తీసుకుంటుంది. 

ద్వితీయార్ధంలో అడిమురై యుద్ధకళ గురించి వివరించే ప్రయత్నం చేశాడు దర్శకుడు. తిరవియపెరుమాళ్‌, నిలాన్‌లు ముత్తయ్య వద్ద దగ్గర అడిమురై యుద్ధకళను అభ్యసించడం తదితర సన్నివేశాలు ఆసక్తికరంగా సాగుతాయి. పెరుమాళ్‌-నిలాన్‌ మధ్య జరిగే పోటీ ఫైట్‌ను ఉత్కంఠగా తీర్చిదిద్దాడు దర్శకుడు. అయితే, కథ మొత్తం ప్రేక్షకుడికి ముందే తెలిసిపోతుంటుంది. క్లైమాక్స్‌ కూడా అందరూ ఊహించినట్లే ఉంటుంది. చివర్లో ఇంటర్నేషనల్‌ ఛాంపియన్‌ షిప్‌ పోటీలు మాత్రం యాక్షన్‌ ప్రియులను అలరిస్తాయి. సగటు మాస్‌ ప్రేక్షకుడిని అలరించే ధ్యేయంతోనే దురై ఆయా సన్నివేశాలను తీర్చిదిద్దారు. 

ఎవరెలా చేశారంటే: ఇటీవల ధనుష్‌ చిత్రాలను చూస్తే సినిమాలో రెండు వైవిధ్య పాత్రలను ఆయనే చేస్తున్నారు. ఒక పక్క కుర్రాడిగా కనిపిస్తూనే, మరోవైపు తండ్రిగా బరువైన పాత్రల్లో మెప్పిస్తున్నారు. ‘అసురన్‌’లోనూ ఇలాగే అలరించిన ఆయన ‘లోకల్‌బాయ్‌’ కోసం తండ్రీ-కొడుకుల పాత్రల్లో మెప్పించారు. మార్షల్‌ ఆర్ట్స్‌లో పట్టున్న ధనుష్‌ ఈ చిత్రంలో అడిమురై యుద్ధకళా నిపుణుడిగా అలరించారు. మెహరీన్‌ పాత్రకు పెద్దగా స్కోప్‌ లేదు. స్నేహ మరోసారి తనదైన నటనతో అలరించారు. అడిమురై కోసం ఆమె తీసుకున్న శిక్షణ వెండితెరపై కనపడుతుంది. ప్రతినాయకుడిగా నవీన్‌చంద్ర మెప్పించాడు. మిగిలిన వాళ్లు తమ పరిధిమేరకు నటించారు. వివేక్‌-మార్విన్‌ సంగీతం బాగుంది. ధనుష్‌ అభిమానులను దృష్టిలో పెట్టుకునే దురై సెంథిల్‌ కుమార్‌ ఈ సినిమాను తీర్చిదిద్దారు. అడిమురై యుద్ధకళ తప్ప కథలో పెద్దగా స్కోప్‌లేదు. యాక్షన్‌ సన్నివేశాలు మినహా సినిమా సాధారణంగా సాగుతుంది. 

బలాలు బలహీనతలు
+ ధనుష్‌ - కథ
+ ఫ్లాష్‌బ్యాక్‌ - ప్రథమార్ధం
+ యాక్షన్‌ సన్నివేశాలు  

చివరిగా: మాస్‌ను మాత్రమే మెప్పించే ‘లోకల్‌ బాయ్‌’ 

గమనిక: ఈ సమీక్ష సమీక్షకుడి దృష్టి కోణానికి సంబంధించింది. ఇది కేవలం అతడి వ్యక్తిగత అభిప్రాయం మాత్రమే. 

Source : Eenadu