పాత్ర కోసం అంత బరువు తగ్గను : రకుల్‌

200220brk rakul
PTI | Updated :February 20, 2020,17:41 IST

హైదరాబాద్‌: తన ఫిట్‌నెస్‌తో ఎందరో అభిమానులు సొంతం చేసుకున్నారు నటి రకుల్‌ ప్రీత్‌సింగ్‌. దక్షిణాది చిత్రాలతోపాటు బాలీవుడ్‌లో సైతం సినిమాల్లో నటిస్తూ ఈ చిన్నది బిజీగా ఉంటుంది. షూటింగ్‌లలో ఎంత బిజీగా ఉన్నప్పటికీ డైలీ వర్కౌట్లను ఆమె మర్చిపోదనే చెప్పాలి. అంతేకాకుండా తన డైలీ వర్కౌట్లకు సంబంధించిన వీడియోలను ఇన్‌స్టా వేదికగా అభిమానులతో పంచుకుంటుంది. అయితే తాజాగా రకుల్‌ను ఫిట్‌నెస్ గురించి ఓ ఆంగ్ల పత్రికకు ఇంటర్వ్యూ ఇచ్చింది. ఇందులో రకుల్‌ తన ఫిట్‌నెస్‌ మంత్ర గురించి తెలిపారు.

‘ఫిట్‌నెస్‌ అనేది జీవితంలో భాగం. ఫిట్‌నెస్‌ను మనం ఒక వారంలో పొందగలమని నేను నమ్మను. దానికి షార్ట్‌కట్స్‌ లేవని నా అభిప్రాయం. నేను పోస్ట్‌ చేసే వర్కౌట్లు చూసి ఏ ఒక్కరిలోనైనా ఫిట్‌గా ఉండాలనే భావన కలిగితే నాకెంతో సంతోషంగా ఉంటుంది. ఈరోజు వర్కౌట్లు చేయడానికి టైం దొరకలేదు. నాకు చాలా బద్ధకంగా ఉంది అని మనం రోజూ అంటుంటాం. కానీ, నిజం చెప్పాలంటే ముందు మన మైండ్‌ సెట్‌ను మార్చుకోవాలి. ఎందుకంటే ఇది మన శరీరం ఆరోగ్యంగా ఉండడం కోసం మనం చేయాల్సిన అతి ముఖ్యమైన పని. మీ కోసం, మీ ఆరోగ్యం కోసం సమయం కేటాయించనప్పుడు ఈ జీవితం ఎందుకు?’ అని రకుల్‌ అన్నారు.

అనంతరం ఆరోగ్యానికి హానికరం కలిగించే పాత్రలకు నో అని చెబుతానని చెప్పారు. ‘సినిమాల్లో ఫిజికల్‌ ట్రాన్స్‌ఫర్మేషన్‌ అనేది కీలక పాత్ర పోషిస్తుంది. కొన్ని సందర్భాల్లో మేము సినిమా, సినిమాకి మధ్య శరీరాకృతిలో వ్యత్యాసం చూపిస్తుంటాం. ‘దే దే ప్యార్‌ దే’ సినిమా కోసం 45 రోజుల్లో ఎనిమిది నుంచి పది కిలోల బరువు తగ్గాను. బరువు తగ్గడం నాకు ఇబ్బంది కాదు. కానీ పాత్ర కోసం 20 కిలోల బరువు తగ్గమంటే నేను అంగీకరించను. నా ఆరోగ్యానికి, ఫిట్‌నెస్‌కు హాని కలిగించేలా నేను ఏం చేయను’ అని రకుల్‌ ప్రీత్‌ సింగ్‌ తెలిపారు.

Source : Eenadu