పెళ్లికుమార్తెగా కత్రినాకైఫ్‌

Capture.png 224
PTI | Updated :January 24, 2020,16:23 IST

వివాహానికి హాజరైన అమితాబ్‌, నాగార్జున..!

ముంబయి: సినీ ఇండస్ట్రీకి చెందిన అగ్రకథానాయకుల సమక్షంలో బాలీవుడ్‌ నటి కత్రినా కైఫ్‌ వివాహం అంగరంగ వైభవంగా జరిగింది. అదేంటీ.. కత్రినా కైఫ్‌కు వివాహం జరిగిందా? అని షాక్‌ అవుతున్నారా!.. అయితే అది నిజమైన వివాహం కాదు.. వృత్తిపరమైన జీవితంలో మాత్రమే. కత్రినా ఓ నగల దుకాణానికి బ్రాండ్‌ అంబాసిడర్‌గా వ్యవహరిస్తున్న విషయం తెలిసిందే. అదే నగల దుకాణానికి తెలుగులో నాగార్జున, తమిళంలో ప్రభు, కన్నడలో శివరాజ్‌కుమార్‌ ప్రచారకర్తలుగా వ్యవహరిస్తున్నారు. వీరందరితోపాటు బాలీవుడ్‌ నటుడు అమితాబ్‌ ఆయన సతీమణి జయాబచ్చన్‌ సైతం బ్రాండ్‌ అంబాసిడర్లగా ఉన్నారు.

తాజాగా ఈ నగల దుకాణం కోసం కొత్త యాడ్‌ను చిత్రీకరించారు. ఇందులో కత్రినా కైఫ్‌కు వివాహం చేస్తున్నట్లు చూపించారు. కత్రినా తల్లిదండ్రులుగా అమితాబ్, జయా బచ్చన్‌ నటించగా, పెళ్లికి వచ్చిన ముఖ్య అతిథులుగా నాగార్జున, ప్రభు, రాజ్‌కుమార్‌ కనిపించారు. ఈ యాడ్‌కు సంబంధించిన పలు ఫొటోలను అమితాబ్‌ సోషల్‌మీడియా వేదికగా షేర్‌ చేశారు. పలు చిత్రపరిశ్రమలకు చెందిన ఒకప్పటి అగ్రకథానాయకుల కుమారులతో కలిసి నటించడం చాలా సంతోషంగా ఉందని అమితాబ్‌ పేర్కొన్నారు.

‘భారత చలనచిత్ర పరిశ్రమలో గొప్పగా చెప్పుకునే ముగ్గురు లెజండరీ నటులకు చెందిన ముగ్గురు సూపర్‌స్టార్‌ కుమారులు. తెలుగు చిత్రపరిశ్రమకు చెందిన అక్కినేని నాగేశ్వరరావు కుమారుడు నాగార్జున, కన్నడ చిత్రపరిశ్రమకు చెందిన డాక్టర్‌ రాజ్‌కుమార్‌ తనయుడు శివరాజ్‌ కుమార్‌, అలాగే తమిళ చిత్రపరిశ్రమకు చెందిన శివాజీ గణేషన్‌ కుమారుడు ప్రభు.. వీరితో కలిసి యాడ్‌ కోసం పనిచేయడం నాకు, జయాబచ్చన్‌కు చాలా సంతోషాన్ని ఇచ్చింది.’ అని అమితాబ్‌ పేర్కొన్నారు. మరోవైపు అమితాబ్‌ షేర్‌ చేసిన ఫొటోలు సినీ ప్రియులను అమితంగా ఆకట్టుకుంటున్నాయి.

Source : Eenadu