వన్‌ప్లస్‌, ఒప్పో, వివో.. ఒకటేనని తెలుసా?

23brk bbk1a
PTI | Updated :January 24, 2020,16:19 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: బడ్జెట్‌ ధరలో మొబైల్‌ కొనాలంటే.. ఒప్పో, వివో. మెరుగైన ఫీచర్ల కోసం రియల్‌మీ. ప్రీమియం ఫోన్ల కోసమైతే చాలా మంది వన్‌ప్లస్‌ ఫోన్లను కొనుగోలు చేస్తుంటారు. ఇవన్నీ చైనా కంపెనీలని అందరికీ తెలుసు. అయితే, చాలా మందికి తెలియని అసలు విషయమేంటంటే? ఇవన్నీ ఒకే గ్రూప్‌నకు చెందినవని! వీటి మాతృ సంస్థ ఒకటేనని!! అదే బీబీకే ఎలక్ట్రానిక్స్‌ గ్రూప్‌. చాలా మందికి ఈ విషయం తెలియకపోవచ్చు. మరి ఒకే కంపెనీ అయినప్పటికీ ఇలా వేర్వేరు బ్రాండ్‌లు ఎందుకు?ఇవన్నీ ప్రజలను చేరువయ్యేందుకు అమలు చేస్తున్న వ్యూహాలేనా..? ఓసారి చూద్దాం..

ఏంటీ బీబీకే ఎలక్ట్రానిక్స్‌..?

బీబీకే ఎలక్ట్రానిక్స్‌ చైనాలో అతిపెద్ద కంపెనీ. 1990 నుంచి పని చేస్తోంది. డ్యువాన్‌ యాంగ్‌పింగ్‌ దీనికి అధిపతి. మ్యూజిక్‌కు సంబంధించిన కంపెనీ ఇది. తొలినాళ్లలో సీడీ, ఎంపీ3, డీవీడీ ప్లేయర్లు, హెడ్‌ఫోన్లు ఇతర గృహోపకరణాలు తయారుచేసేది. అన్నీ సవ్యంగా సాగుతున్న సమయంలో బీబీకే ఎలక్ట్రానిక్స్‌ సంస్థ పైరసీ విషయంలో న్యాయపరమైన చిక్కులు ఎదుర్కొంది. దివాళా తీసే స్థితికి చేరుకుంది. దీంతో ఆ సంస్థ తన వ్యాపారాన్ని బహుళ సంస్థలుగా విభజించింది. ఒకవేళ ఏదైనా కంపెనీ వ్యాపారం విషయంలో చిక్కులు ఎదుర్కొన్నా మాతృ సంస్థకు ఎలాంటి ఇబ్బంది ఉండకూడదన్నది ఆ కంపెనీ వ్యూహం.

ఒప్పోతో మొదలై..

తొలినాళ్లలో కేవలం మ్యూజిక్‌ సంబంధిత వ్యాపారానికే పరిమితమైన బీబీకే కంపెనీ క్రమంగా మొబైల్‌ తయారీ రంగంలోకి అడుగుపెట్టింది. అలా 2004లో ఒప్పో కంపెనీ అవతరరించింది. అనంతరం వివో పుట్టుకొచ్చింది. వివో ఫోన్లపై ‘కెమెరా అండ్‌ మ్యూజిక్‌’ అనే ట్యాగ్‌లైన్‌ ఉంటుంది. దీనికి కారణం బీబీకే మ్యూజిక్‌ కంపెనీ కావడమే ఇందుకు కారణం. ఒప్పో, వివో తర్వాత, వన్‌ప్లస్‌, రియల్‌మీ బ్రాండ్లు ఇదే మాతృ సంస్థ నుంచి అవతరించాయి. కొత్తగా వివో సబ్‌ బ్రాండ్‌ అయిన ఐక్యూఓఓ సైతం భారత మార్కెట్లోకి అడుగుపెడుతోంది. అంటే ఈ గ్రూప్‌ నుంచి వస్తున్న ఐదో కంపెనీ అన్నమాట.

వీళ్లో రకం.. వాళ్లో రకం

ఒకే గ్రూప్‌నకు చెందిన ఈ కంపెనీలైనప్పటికీ ఒక్కొక్కొరిదీ ఒక్కో వ్యాపార సరళి. ముందుగా ఒప్పో, వివో విషయానికొస్తే.. భారత మార్కెట్‌లోకి అడుగుపెట్టిన తొలినాళ్లలో ఎక్కడ పడితే అక్కడ విపరీతంగా వీటి తాలూకా ప్రకటనలు కనిపించేవి. క్రికెట్‌, ఫుట్‌బాల్‌ స్పాన్సర్‌షిప్‌, హోర్డింగులు ద్వారా ప్రకటనలు హోరెత్తించేవి. రిటైలర్లకు అధిక కమిషన్ అందించేవి. అందుకే మనం ఏదైనా మొబైల్‌ విక్రయ దుకాణానికి వెళితే ఆయా కంపెనీల ఫోన్లను వారు ఎక్కువగా సూచిస్తుంటారు. ఇక వన్‌ప్లస్‌, రియల్‌మీ అలా కాదు. ముఖ్యంగా వన్‌ప్లస్‌ విషయంలో ఎక్కడా ప్రకటనలు మనకు కనిపించవు. కమిషన్‌ కూడా నామమాత్రంగానే ఇస్తుంటారు. తక్కువ ధరకే మెరుగైన ఫీచర్లు అందించి ప్రజలే దీని గురించి చెప్పుకొనేలా చేయడం బీబీకే వ్యూహం. రియల్‌మీ విషయంలోనూ ఇదే వ్యూహాన్ని బీబీకే గ్రూప్‌ అవలంబిస్తోంది. అందుకే షావోమికి పోటీగా రియల్‌మీ భారత్‌లో దూసుకెళుతోంది.

మొదలైన పోటీ..

భారత మార్కెట్‌లో ప్రస్తుతం మొబైల్‌ కంపెనీల మధ్య పోటీ తీవ్రంగా ఉంది. అందులోనూ చైనాకు కంపెనీల మధ్య ఈ పోటీ మరీ ఎక్కువగా ఉంది. కౌంటర్‌ పాయింట్‌ (2019 సెప్టెంబర్‌ 30 వరకు) నివేదిక ప్రకారం.. చైనాకు చెందిన షావోమి మార్కెట్‌లో అగ్రస్థానంలో ఉంది. దక్షిణ కొరియాకు చెందిన శాంసంగ్‌ రెండో స్థానంలో ఉంది. వివో, రియల్‌మీ, ఒప్పో, వన్‌ప్లస్‌ తర్వాతి స్థానాల్లో ఉన్నాయి. వాస్తవానికి బీబీకేదే ఇక్కడ అగ్రపీఠమన్నది ఇక్కడ గమనించాల్సిన విషయం. ఎందుకంటే ఈ గ్రూప్‌నకు చెందిన అన్ని కంపెనీల మార్కెట్‌ వాటా కలిపితే ఇది స్పష్టమవుతుంది. అందుకే ఇప్పుడు ఇతర మొబైల్‌ కంపెనీలు సబ్‌బ్రాండ్‌లను స్వతంత్ర కంపెనీలుగా మార్చే విషయంపై దృష్టి పెట్టాయి. షావోమి తన ‘రెడ్‌మీ’, ‘పోకో’ను స్వతంత్ర కంపెనీలుగా ఇప్పటికే ప్రకటించిన సంగతి తెలిసిందే. వివో సైతం తన సబ్‌ బ్రాండ్‌ ‘ఐక్యూఓఓ’ను స్వతంత్ర కంపెనీగా నెలకొల్పింది. ఇలా తనకే చెందిన కంపెనీల మధ్య పోటీ సృష్టించి వేర్వేరు బ్రాండ్ల పేరిట బీబీకే ఎలక్ట్రానిక్స్‌ అతిపెద్ద మార్కెట్‌ వాటాను చేజిక్కుంచుకుంటోంది. విదేశాలకు సైతం విస్తరిస్తోంది. ఏదైనా కారణంతో ఓ కంపెనీ పేరు, ప్రతిష్ఠ దెబ్బతిన్నా ఇతర కంపెనీలపై ఆ ప్రభావం ఉండకూడదన్నది బీబీకే అసలు వ్యూహం.

Source : Eenadu