చైనాకు భారత్‌ వార్నింగ్‌!

31chinabrk1a
PTI | Updated :October 31, 2019,19:40 IST

అంతర్గత వ్యవహారాల్లో జోక్యం చేసుకోవద్దు 

దిల్లీ: జమ్మూకశ్మీర్‌ విభజనను తప్పుబట్టిన చైనాకు భారత్‌ గట్టి వార్నింగ్‌ ఇచ్చింది. జమ్మూకశ్మీర్‌, లద్దాఖ్‌ కేంద్ర పాలిత ప్రాంతాలుగా విభజించడం చట్టవిరుద్ధమని చైనా పేర్కొనడంపై  మండిపడుతూ భారత విదేశాంగ శాఖ గురువారం ఓ  ప్రకటన జారీ చేసింది. ‘‘భారత సార్వభౌమత్వాన్ని, ప్రాదేశిక సమగ్రతను ఇతర దేశాలు గౌరవిస్తాయని మేం భావిస్తున్నాం. భారత అంతర్గత వ్యవహారాల్లో చైనా సహా ఇతర దేశాల వ్యాఖ్యలను మేం ఆశించడం లేదు.  మా దేశం కూడా ఇతర దేశాల అంతర్గత వ్యవహారాల్లో తలదూర్చడంలేదు’’ అని విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి రవీష్‌ కుమార్‌ పేర్కొన్నారు. ఆర్టికల్‌ 370 రద్దు చేస్తూ కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నాక బుధవారం అర్ధరాత్రి నుంచి జమ్మూకశ్మీర్‌, లద్దాఖ్‌లలో పునర్వవస్థీకరణ చట్టం అమలులోకి వచ్చింది. 

అసలు చైనా ఏమంది?

జమ్ము కశ్మీర్‌ రాష్ట్రాన్ని రెండు కేంద్ర పాలిత ప్రాంతాలుగా విభజించడం చట్ట విరుద్ధమైనదని చైనా విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి జెంగ్‌ షువాంగ్‌ అన్నారు. కేంద్ర పాలిత ప్రాంతంగా ప్రకటించిన భూభాగంలోనే తమ భూభాగం కూడా కలిసి ఉందని, ఇది తమ దేశ సార్వభౌమాధికారానికి సవాల్‌ లాంటిదని అభిప్రాయపడ్డారు. గురువారం ఉదయం ఆయన బీజింగ్‌లో మీడియాతో మాట్లాడుతూ.. ‘‘భారత నిర్ణయాన్ని చైనా ఖండిస్తోంది. చైనా సార్వభౌమత్వాన్ని సవాల్‌ చేస్తూ భారత్ తన దేశీయ చట్టాలను, పరిపాలనా సూత్రాలను ఏకపక్షంగా మార్చింది. చైనా ప్రాదేశిక సార్వభౌమత్వాన్ని గౌరవించాలని, ఇరు దేశాల ఒప్పందాలకు కట్టుబడి ఉండాలని భారత్‌ను కోరుతున్నాం. సరిహద్దు ప్రాంతాల్లో శాంతియుత వాతావరణానికి సహకరించాలని ఆశిస్తున్నాం. అంతేకాక సరిహద్దు సమస్యను సరైన రీతిలో పరిష్కరించేందుకు అనుకూలమైన పరిస్థితులను సృష్టించాలి’’ అని ఆయన పేర్కొన్నారు. దీనిపై భారత విదేశాంగ దీటుగా బదులిచ్చింది. చైనా - పాకిస్థాన్‌ సరిహద్దు ఒప్పందం - 1963 కింద చైనాయే పాక్‌ ఆక్రమిత కశ్మీర్‌ ప్రాంతంలోని భారత ప్రదేశాలను అక్రమంగా స్వాధీనం చేసుకుందని రవీష్‌ మండిపడ్డారు.

Source : Eenadu