సమ్మెపై కేసీఆర్‌తో ప్రత్యేకంగా చర్చిస్తా: పవన్‌

Pawan rtcjac1
PTI | Updated :October 31, 2019,17:02 IST

హైదరాబాద్‌: జనసేన అధినేత పవన్‌కల్యాణ్‌తో ఆర్టీసీ కార్మిక సంఘాల ఐకాస నేతలు సమావేశమయ్యారు. బంజారాహిల్స్‌లోని జనసేన కార్యాలయంలో ఐకాస కన్వీనర్‌ అశ్వత్థామరెడ్డి, ఇతర నేతలు పవన్‌ను కలిసి సమ్మెకు మద్దతివ్వాలని కోరారు. ఐకాస నేతల విజ్ఞప్తిపై పవన్‌ సానుకూలంగా స్పందించారు. అనంతరం మీడియాతో ఆయన మాట్లాడారు. 27 రోజులుగా ఆర్టీసీ కార్మికులు సమ్మెలో ఉండటం బాధ కలిగిస్తోందన్నారు. కార్మికులెవరూ ఆత్మహత్యలకు పాల్పడవద్దని సూచించారు. సీఎం కేసీఆర్‌పై తనకు అపారమైన గౌరవం ఉందన్నారు. సమ్మెపై ప్రభుత్వం మొండిగా వ్యవహరించడం మంచిదికాదని చెప్పారు. ఈ అంశంపై రెండు రోజుల్లో కేసీఆర్‌తో ప్రత్యేకంగా చర్చిస్తానన్నారు. కేసీఆర్‌ పట్టించుకోని పక్షంలో ఆర్టీసీ కార్మికుల భవిష్యత్‌ కార్యాచరణకు తన సంపూర్ణ మద్దతు ఉంటుందని పవన్‌ స్పష్టం చేశారు.

Source : Eenadu