నవంబర్‌ 2న తెలంగాణ కేబినెట్‌ భేటీ

Kcr1a 19
PTI | Updated :October 31, 2019,16:53 IST

హైదరాబాద్‌: తెలంగాణ ఆర్టీసీ వ్యవహారంలో కీలక నిర్ణయం తీసుకునేందుకు రంగం సిద్ధమైంది. ఇందుకు ముహూర్తం కూడా ఖరారైంది. ఇందులో భాగంగా రాష్ట్ర మంత్రి వర్గం శనివారం సమావేశం కానుంది. ఆరోజు మధ్యాహ్నం 3 గంటలకు ప్రగతి భవన్‌లో ముఖ్యమంత్రి కేసీఆర్‌ అధ్యక్షతన కేబినెట్‌ భేటీ కానుంది. ఆర్టీసీ అంశమే ప్రధాన అజెండాగా మంత్రివర్గం సమావేశం కానుంది. ఆర్టీసీ కార్మికుల సమ్మె కొనసాగుతున్న తరుణంలో  ప్రజలకు ఇబ్బందులు కలుగకుండా ప్రత్యామ్నాయ రవాణా విధానాన్ని అమల్లోకి తేవాలని రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే నిర్ణయించింది. ఆర్టీసీలో సగం యాజమాన్యం బస్సులు, 30 శాతం అద్దె బస్సులు, మిగతా 20 శాతం ప్రైవేట్‌ స్టేజ్‌ కేరియర్లు ఉండాలన్నది సర్కార్‌ ఆలోచన. అందుకు అనుగుణంగా ఇప్పటికే 26 శాతం ఉన్న అద్దె బస్సులకు అదనంగా మిగతా 4శాతం అద్దెబస్సులకు ఇప్పటికే నోటిఫికేషన్‌ జారీ అయ్యింది. ఇక మిగిలేది.. ప్రైవేట్‌ స్టేజ్‌ కేరియర్లకు అనుమతులు ఇవ్వడమే.

కేంద్ర ప్రభుత్వం కొత్తగా తీసుకొచ్చిన చట్టం ప్రకారం.. ప్రజలకు మెరుగైన రవాణా సౌకర్యం కోసం ప్రైవేటు స్టేజ్‌ కేరియర్లకు అనుమతులు ఇవ్వవచ్చని సీఎం కేసీఆర్‌ ఇప్పటికే తెలిపారు. అందుకు అనుగుణంగా అనుమతులిచ్చేందుకు రంగం సిద్ధమవుతోంది. 4 నుంచి 5 వేల రూట్లలో ప్రైవేట్‌ స్టేజ్‌ కేరియర్లకు అనుమతులు ఇచ్చేందుకు అవకాశాలు కనిపిస్తున్నాయి. వీటితోపాటు హైదరాబాద్‌ మెట్రోరైలుకు సర్వీసుల అనుసంధానం, సెట్విన్‌ సర్వీసుల సేవలు వినియోగించుకోవడం లాంటి ప్రతిపాదనలను ప్రభుత్వం పరిశీలిస్తోంది. వీటన్నింటిపై శనివారం జరిగే మంత్రివర్గ సమావేశంలో కీలక నిర్ణయం తీసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. అటు పురపాలిక ఎన్నికల సహా ఇతర అంశాలపైనా కేబినెట్‌లో చర్చించనున్నారు.

Source : Eenadu