విలీనం చేసే వరకు పోరాటం ఆగదు

301019add brk1 %281%29
PTI | Updated :October 30, 2019,17:48 IST

‘సకల జనభేరి’సభలో స్పష్టం చేసిన కార్మికులు


హైదరాబాద్‌: తెలంగాణ ఆర్టీసీ కార్మిక సంఘాలు నిర్వహించిన ‘సకల జన భేరి’ సభ విజయవంతమైంది. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాల్సిందేనని కార్మికులు నినదించారు. సరూర్‌ నగర్‌ ఇండోర్‌ స్టేడియంలో నిర్వహించిన సభకు రాష్ట్ర నలుమూలల నుంచి ఆర్టీసీ కార్మికులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. కార్మికులకు మద్దతుగా ప్రజా సంఘాలు, విపక్ష  నేతలు హాజరై  ప్రభుత్వం వ్యహరిస్తున్న తీరుపై ధ్వజమెత్తారు. 26 రోజులుగా సమ్మె చేస్తున్న కార్మికులకు సంఘీభావం తెలిపారు. కార్మికుల డిమాండ్లను ప్రభుత్వం పరిష్కరించే వరకు పోరాటం కొనసాగిద్దామని, అప్పటి వరకు కార్మికులకు అండగా ఉంటామని నేతలు స్పష్టం చేశారు. హైకోర్టు ఆదేశాలమేరకు సాయంత్రం 6గంటలకే సభ ముగించారు.

విలీనం ఎందుకు సాధ్యం కాదు: రేవంత్‌
 టీఎస్‌ ఆర్టీసీ నష్టాల్లో లేదని, పాలకులే ఆర్టీసీని నష్టాల్లోకి నెట్టారని కాంగ్రెస్‌ ఎంపీ రేవంత్‌రెడ్డి ఆరోపించారు. సకలజనభేరి సభలో ఆయన మాట్లాడుతూ.. ఆర్టీసీ కార్మికుల సమ్మెకు మద్దుతుగా తెలంగాణలోని  అన్ని వర్గాలవారు ఏకమై కదిలారన్నారు. తెలంగాణ ప్రజలెప్పుడూ స్వేచ్ఛ కోసమే పోరాటం చేశారని గుర్తు చేశారు.  కోర్టు అనుమతి ఇచ్చిన 24 గంటల్లోపే నిర్వహించిన సభకు వేలాదిగా కార్మికులు తరలివచ్చారని, సభ అనుమతుల కోసం కోర్టుకు వెళ్లాల్సిన పరిస్థితి వచ్చిందన్నారు. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయడం ఎందుకు సాధ్యం కాదో చెప్పాలన్నారు. ఆర్టీసీని ప్రైవేటుపరం  చేస్తామని తెరాస  ఎన్నికల అజెండాలో పెట్టిందా అని ప్రశ్నించారు. ఎన్నికల అజెండాలో పెట్టిన ఎన్ని అంశాలను కేసీఆర్‌ ఇప్పటి వరకు అమలు చేశారని నిలదీశారు. ప్రతి రోజూ కోటి జనాభాకు మేలు చేసే ఆర్టీసీని సీఎం కేసీఆర్‌ ఎందుకు పట్టించుకోవడంలేదని  ప్రశ్నించారు. విమాన ఇంధనంపై ఒక శాతం వ్యాట్‌ విధించి, డీజిల్‌పై 27శాతం వ్యాట్‌ విధించారని ఆరోపించారు. 18 రకాల వర్గాలకు ఉచిత బస్‌పాసులు ఇచ్చిన ప్రభుత్వం వాటి రాయితీలు మాత్రం చెల్లించడం లేదన్నారు.

మిలియన్‌ మార్చ్‌ నిర్వహిస్తాం: కోదండరామ్‌
 ఆర్టీసీ కార్మికులకు మద్దతుగా దీక్షలు, రాస్తారోకోలు చేస్తామని తెలంగాణ జనసమితి అధ్యక్షుడు కోదండరామ్‌ తెలిపారు.  ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. అవసరమైతే ట్యాంక్‌ బండ్‌పై మిలియన్‌ మార్చ్‌ నిర్వహిస్తామని స్పష్టం చేశారు. చిన్న, చిన్న కారణాలు చూపి కార్మికుల ఇంక్రిమెంట్లు తగ్గిస్తున్నారని, వారి వేతనాలు కూడా చాలా తక్కువగానే ఉన్నాయన్నారు.  కార్మికులు జీతాలు పెంచమని కోరడం లేదు.. ఆర్టీసీని బతికించమని కోరుతున్నారని తెలిపారు. ఆర్టీసీకి రావాల్సిన బస్సు పాసుల రాయితీలు చెల్లించాలని కోరుతున్నారని వివరించారు. కార్మికుల వల్లే ఆర్టీసీ నష్టాల్లో ఉన్నట్లు ప్రభుత్వం ప్రచారం చేస్తోందని కోదండరామ్‌ విమర్శించారు.

కేసీఆర్‌ బెదిరించారు: అశ్వత్థామరెడ్డి

 సమ్మెతో తమకు ఎన్ని ఇబ్బందులు ఎదురవుతున్నా గమ్యాన్ని చేరాల్సిందేనని ఆర్టీసీ కార్మిక సంఘాల ఐకాస కన్వీనర్‌ అశ్వత్థామరెడ్డి అన్నారు. తెలంగాణ కోసం కులమతాలకు అతీతంగా అందరూ ఉద్యమం చేశారని.. తాము కూడా పాల్గొన్నామని చెప్పారు.  సకల జనభేరి సభలో అశ్వత్థామ రెడ్డి మాట్లాడారు. ‘‘రామాయణంలో ఉడత రామునికి దారి చూపించకుంటే రామాయణమే లేదు. మేం ఉడతలాంటి వాళ్లం. మమ్మల్ని సీఎం కేసీఆర్‌ బెదిరించారు.. భయపెట్టారు. జీతాలు ఇవ్వకున్నా ఏ ఒక్క కార్మికుడూ వెనక్కి తగ్గలేదు’’ అని ఆయన అన్నారు. ఆర్టీసీ ఐకాస కో కన్వీనర్‌ రాజిరెడ్డి మాట్లాడుతూ తమకు కావాల్సింది ఆర్టీసీ పరిరక్షణ.. ప్రజా పరిరక్షణ అని చెప్పారు. యూనియన్లను మూసేస్తామంటున్నారని.. అలా చేయాలనుకుంటే ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలని ఆయన డిమాండ్‌ చేశారు. అప్పుడు సీఎం కేసీఆర్‌ కోరిక కూడా నెరవేరుతుందని రాజిరెడ్డి ఎద్దేవా చేశారు.

సమ్మెపై కేంద్రం జోక్యం చేసుకోవాలి: చాడ

 సీఎం కేసీఆర్‌కు రాజ్యాంగంపై ఏమాత్రం అవగాహన లేదని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకటరెడ్డి విమర్శించారు. తెలంగాణ ఉద్యమంలో ఆర్టీసీ కార్మికుల పాత్ర ఎప్పటికీ మరువలేనిదని చెప్పారు. ‘సకల జనభేరి’ సభలో చాడ వెంకటరెడ్డి మాట్లాడారు. ఆర్టీసీ సమ్మె అంశంలో కేంద్ర ప్రభుత్వం జోక్యం చేసుకోవాలని ఆయన కోరారు. నిజాం హయాంలో ప్రభుత్వం పరిధిలోనే ఆర్టీసీ సంస్థ నడిచిందని గుర్తు చేశారు. ఇప్పటికే 15 మంది ఆర్టీసీ కార్మికులు ఆత్మహత్యలు చేసుకున్నారని చాడ ఆవేదన వ్యక్తం చేశారు. కార్మికుల ఆత్మహత్యలకు ప్రభుత్వమే బాధ్యత వహించాలని డిమాండ్‌ చేశారు. సెల్ఫ్‌ డిస్మిస్‌ పేరుతో 48వేల మంది కార్మికులను కేసీఆర్‌ మనోవేదనకు గురిచేస్తున్నారని మండిపడ్డారు. ప్రజలకు విద్య, వైద్యంతో పాటు రవాణా కూడా అంతే అవసరమని.. వందశాతం ఆర్టీసీ ఉండాలన్నారు. ప్రభుత్వంలో విలీనం చేయాలని చాడ వెంకటరెడ్డి డిమాండ్‌ చేశారు. వెంటనే కార్మికులను చర్చలకు ఆహ్వానించాలని.. ప్రభుత్వం దిగి రాకపోతే ఉద్యమాన్ని మరింత ఉద్ధృతం చేస్తామని ఆయన హెచ్చరించారు.

ఇలాగే ఉంటే మిమ్మిల్నీ ఏమీ చేయలేరు: ఎల్‌.రమణ

ఆర్టీసీ ఆస్తులను అన్యాక్రాంతం చేయాలని కేసీఆర్‌ కుట్ర చేస్తున్నారని తెదేపా రాష్ట్ర అధ్యక్షుడు ఎల్‌.రమణ ఆరోపించారు. 25 రోజులుగా ఆర్టీసీ కార్మికులు ఐకమత్యంగా ఉన్నారని.. ఇలాగే ఉంటే మిమ్మల్ని ఎవరూ ఏమీ చేయలేరని ఆయన వ్యాఖ్యానించారు. అమరవీరులు స్తూపం వద్ద నివాళులర్పించేందుకు వెళ్తే అరెస్ట్‌ చేశారని రమణ ఆగ్రహం వ్యక్తం చేశారు. కార్మికుల వెంట విపక్షాలన్నీ ఉంటాయన్నారు.

తప్పుడు ప్రచారాలతో తుగ్లక్‌ పాలన: భాజపా నేత వివేక్‌
భాజపా నేత, మాజీ ఎంపీ వివేక్‌ మాట్లాడుతూ.. కేసీఆర్‌ పెద్ద అవకాశవాది అని ఆరోపించారు. ఆర్టీసీపై ఆయన అబద్ధాలు మాట్లాడుతున్నారని విమర్శించారు. తప్పుడు ప్రచారాలతో తుగ్లక్‌ పాలన చేస్తున్నారని మండిపడ్డారు. ఆర్టీసీ కార్మికులకు జీతాలు ఇవ్వడం లేదంటే ప్రజలు నివ్వెరపోతున్నారని చెప్పారు. కార్మికుల ఉద్యమానికి అన్ని రాజకీయ పార్టీలు అండగా ఉంటాయని.. ఐక్యంగా ఉద్యమిద్దామని వివేక్‌ పిలుపునిచ్చారు.

కేసీఆర్‌కు సవాల్‌ విసిరింది ఆర్టీసీ కార్మికులే: మందకృష్ణ

ఐదేళ్లలో కేసీఆర్‌కు మొట్టమొదటిసారిగా సవాల్‌ విసిరింది ఆర్టీసీ కార్మికులేనని ఎమ్మార్పీఎస్‌ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ అన్నారు. ఆర్టీసీలో 95 శాతం పేదలే ఉన్నారని చెప్పారు. సంస్థను సీఎం కేసీఆర్‌ అమ్మేయాలని చూస్తున్నారని.. ఈ క్రమంలో దాన్ని కాపాడుకోవాలని కార్మికులు పోరాటం చేయడం అభినందనీయమని చెప్పారు. ఆర్టీసీ కార్మికులు సమ్మెకు దిగినప్పుడు ఒంటరిగా ఉన్నారని.. ఇప్పుడు తెలంగాణ సమాజం మొత్తం అండగా ఉందన్నారు. ఆత్మహత్యలకు పాల్పడకుండా పోరాటాన్ని కొనసాగించాలని మందకృష్ణ సూచించారు.

Source : Eenadu