అరగంటలో అమెరికాను చేరే డ్రాగన్‌ క్షిపణి..!

Df 41
PTI | Updated :October 01, 2019,17:50 IST

 కమ్యూనిస్టు పార్టీ 70వ వార్షికోత్సవంలో ఆవిష్కరణ

ఇంటర్నెట్‌డెస్క్‌: చైనా ఆయుధ బలాన్ని మరోసారి ప్రదర్శించింది. అత్యంత ఆధునిక ఆయుధాలను ఈ సారి ప్రదర్శనకు తెచ్చింది. వీటిల్లో అర గంటలో అమెరికాను చేరుకునే బాలిస్టిక్‌ క్షిపణనిని తొలిసారి ప్రదర్శించింది. చైనాకు చెందిన వాహనాలు ఈ క్షిపణులతో తియన్మాన్‌ స్క్వేర్‌ వద్ద బారులు తీరాయి. ప్రస్తుతం ప్రపంచంలోనే ఇది అత్యంత శక్తిమంతమైన క్షిపణిగా అమెరికా వార్తా ఛానల్‌ సీఎన్‌ఎన్‌ చెబుతోంది. ఈ క్షిపణి  15,000 కిలోమీటర్లు ప్రయాణించగలదు. కేవలం 30 నిమిషాల్లోనే అమెరికా చేరుకొంటుంది. ఒకే సారి 10 వార్‌హెడ్ల(బాంబులు)ను తీసుకెళ్లే సామర్థ్యం దీనికుంది. అంతేకాదు ఈ క్షిపణి అమెరికా రక్షణ వ్యవస్థలను తప్పించుకొని ప్రయాణించగలడం విశేషం. దీనిని ఏడోతరం క్షిపణిగా సౌత్‌చైనా మార్నింగ్‌ పోస్టు పేర్కొంది. శబ్దవేగానికి దాదాపు 25 రెట్ల వేగంతో ప్రయాణించగలదు. ఇప్పటికే చైనా వద్ద 11,200 కిలోమీటర్లు ప్రయాణించే డాంగ్‌ఫెంగ్‌ క్షిపణి ఉంది. దక్షిణ చైనా సముద్రంలో జరుగుతున్న ఘర్షణల నేపథ్యంలో చైనా ఈ ఆయుధాన్ని ప్రదర్శించడం ప్రాధాన్యం  సంతరించుకొంది. ఇప్పటికే దక్షిణ చైనా సముద్రంలో కృత్రిమ దీవులను నిర్మించి అక్కడ ఆయుధాలను మోహరించింది. 


డీఎఫ్‌-17 హైపర్‌ సానిక్‌ బాలిస్టిక్‌ క్షిపణి

డాంగ్‌ఫెంగ్‌ -17 హైపర్‌ సానిక్‌ బాలిస్టిక్‌ క్షిపణి కూడా నేటి ప్రదర్శనలో ఉంది. ఇది హైపర్‌ సానిక్‌ వేగంతో కదులుతూ కిపణి రక్షణ వ్యవస్థలను తప్పుదోవపట్టించగలదు. లక్ష్యాలను మార్చుకొనే సామర్థ్యం దీనికి ఉంది. అణ్వాయుధాలను కూడా ఇది మోసుకెళ్లగలదు. దీనిని 2017లో చైనా తొలిసారి పరీక్షించింది. 


స్టెల్త్‌ డ్రోన్‌ డీఆర్‌-8

స్టెల్త్‌ డ్రోన్‌ డీఆర్‌-8ను చైనా సిద్ధం చేసింది. ఈ డ్రోన్‌ అమెరికాకు చెందిన గువామ్‌ ప్రాంతాలను చేరుకోగలదు. నిఘా అవసరాల కోసం ఈ డ్రోన్‌ను అభివృద్ధి చేసింది. చైనా ఇప్పటికే డ్రోన్‌ టెక్నాలజీ కోసం భారీగా పెట్టుబడి పెట్టింది. షార్ప్‌ స్వోర్డ్‌ అటాకింగ్‌  డ్రోన్‌ను కూడా చైనా అభివృద్ధి చేసింది. 


జే20 స్టెల్త్‌ జెట్‌..

ఇటీవల పీఎల్‌ఏ ఎయిర్‌ ఫోర్స్‌ దీనిని ప్రదర్శించింది. దీనిని చైనా మల్టీరోల్‌ స్టెల్త్‌ జెట్‌గా పేర్కొంటోంది. (నిఘా, గగనతల  రక్షణ, ఉపరితలంపై దాడులకు ఉపయోగించేవాటిని మల్టీరోల్‌ స్టెల్త్‌ అంటారు.) వీటిని ఇప్పటికే చైనా యుద్ధ పరిస్థితుల్లో పరీక్షించింది. 


ది హెచ్‌-6ఎన్‌ బాంబర్లు..

చైనా సుదూర ప్రాంతాలకు ప్రయాణించి బాంబిగ్‌ చేయగల ‘ది హెచ్‌-6ఎన్‌’ కొత్త వెర్షన్‌ను సిద్ధం చేసింది. ఇటీవల ట్విటర్‌లో బయటకు వచ్చిన దీని ఫొటోలను వెంటనే డిలీట్‌ చేసింది. దీనికి యాంటీ  షిప్‌ క్షిపణులను కూడా అమర్చినట్లు ప్రచారం జరిగింది. 


టైప్‌ 15 ట్యాంకులు

చైనా ఇటీవల తేలికపాటి టైప్‌ 15 ట్యాంకులను అభివృద్ధి చేసింది. వీటిని చైనా సైన్యంలో ఇటీవలే ప్రవేశపెట్టారు. ఈ విషయం చైనా జాతీయ రక్షణపై రూపొందించిన శ్వేతపత్రంలో పేర్కొన్నారు.

Source : Eenadu