ఆ వాగుతో అమరావతికి ముంపు!: విజయసాయి

210819vijayasai bnrkk1
PTI | Updated :August 21, 2019,18:12 IST

దిల్లీ: వైకాపా ముఖ్యనేత, ఎంపీ విజయసాయిరెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. ఏపీ సీఎం జగన్‌ ఏ నిర్ణయం తీసుకున్నా ప్రధాని మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్‌షాతో సంప్రదించే తీసుకుంటున్నారని చెప్పారు. గత ప్రభుత్వం అవినీతికి పాల్పడి రాష్ట్ర ఖజానాను దోచుకుందని.. బాధ్యులైన వారందర్నీ చట్టపరిధిలోకి తీసుకురావాలనేదే తమ దృఢ సంకల్పమన్నారు. దిల్లీలో మీడియాతో ఆయన మాట్లాడారు. అవినీతి నివారణలో తమ సంకల్పానికి మోదీ, అమిత్‌షా ఆశీస్సులు ఉన్నాయని వ్యాఖ్యానించారు. పోలవరం రివర్స్‌ టెండరింగ్‌, పీపీఏ అంశాల్లోనూ ప్రధాని మోదీతో మాట్లాడాకే సీఎం నిర్ణయం తీసుకున్నారన్నారు.

రాజధానిపై ప్రభుత్వం ఏదైనా నిర్ణయం తీసుకుంటే తప్పకుండా మీడియాకు చెబుతుంది కదా అని విజయసాయి వ్యాఖ్యానించారు. ఇంతవరకు తీసుకోని నిర్ణయంపై చర్చ అనవసరమన్నారు. భారీ వర్షాలు, వరదలు వచ్చినపుడు కొండవీటి వాగు వల్ల రాజధాని అమరావతి ముంపునకు గురయ్యే ప్రమాదముందని చెప్పారు. పోలవరం రీటెండరింగ్‌, పీపీఏ వ్యవహారాల్లో తెదేపా నేతలు దుష్ప్రచారం చేస్తున్నారని.. దాన్ని నమ్మవద్దని ఆయన హితవు పలికారు.

Source : Eenadu