హమ్మ చైనా.. రిసార్టే సైనిక స్థావరం..!

Dara 1
PTI | Updated :July 01, 2019,18:56 IST

 కంబోడియాలో పావులు కదుపుతున్న డ్రాగన్‌

ఇంటర్నెట్‌డెస్క్‌: చైనా ఉచ్చులో తాజాగా కంబోడియా పడింది.  దీంతో ఏడాదికో మిలియన్‌ డాలర్లను ఎరగా వేసి దాదాపు 45000 హెక్టార్ల భూమిని 40ఏళ్లపాటు లీజుకు తీసేసుకుంది. ఇప్పడు అక్కడ సైనిక అవసరాలకు తగినట్లు నిర్మాణాలు చేపడుతోంది. ఇది కూడా అంతర్జాతీయంగా కీలమైన మలక్కా జలసంధికి దగ్గర్లోనే కావడం విశేషం. 
కంబోడియా తీరప్రాంతమైన ఖోకాంగ్‌ ప్రావిన్స్‌లో చైనా 45వేల హెక్టార్లభూమిని 40ఏళ్లపాటు లీజుకు తీసుకొంది.. అంటే ఆ తీరప్రాంతంలో 20శాతం అన్నమాట. దీని కోసం ఏడాదికి కంబోడియాకు మిలియన్‌ డాలర్లను చెల్లించనుంది. ఇక్కడ రిసార్టును నిర్మించే బాధ్యతను చైనాకు చెందిన యూనియన్‌ డెవలప్‌మెంట్‌ గ్రూప్‌ చేపట్టింది. ఈ ప్రాజెక్టు పేరు దరా సకోర్‌ సీషోర్‌ రిసార్ట్‌గా పెట్టారు. 
మరోపక్క కంబోడియాతో చైనా సైనిక సహకారాన్ని పెంపొందించుకుంటోంది. దీనిపై ఇటీవల అమెరికా ఉపాధ్యక్షుడు మైక్‌ పెన్స్‌ కూడా ఆందోళన వ్యక్తం చేశారు. కంబోడియా ప్రధానికి ఓ లేఖరాశారు. అక్కడి భూభాగంలో చైనా సైనిక స్థావరాలను అనుమతించవద్దని కోరారు. కానీ ఇప్పటికే కంబోడియా ప్రధాని హున్‌ సేన్‌ కిరిసాకోర్‌ అనే ప్రదేశాన్ని చైనా నావికాదళానికి అప్పగించే యోచనలో ఉన్నట్లు సమాచారం. అయితే హున్‌సేన్‌ మాత్రం పైకి తమ భూభాగంలోకి చైనాను సైన్యాన్ని అనుమతించబోమని చెబుతున్నారు. 
మరోపక్క చైనా సంస్థ యూడీజీ చేపట్టిన నిర్మాణాలను చూస్తే వాటిని తేలిగ్గా సైనిక స్థావరంగా మార్చేసే అవకాశం ఉందని అంగ్ల వెబ్‌సైట్‌ ది ప్రింట్‌ పేర్కొంది. అక్కడి టూరిజం అవసరాల కంటే ఆ రిసార్ట్‌ ఎన్నో రెట్లు పెద్దిగా ఉంది. ఇక్కడ భారీ గోల్ఫ్‌ కోర్స్‌, నాలుగు క్రూయిజర్‌ బోట్లు ఉన్నాయి. ఇక్కడ నిర్మాణ పనుల కారణంగా ఈ ప్రాంతం మొత్తం ఒక్కసారిగా సందడిగా మారిపోయింది. కాకపోతే ఇక్కడ ఉద్యోగాలు మొత్తం చైనీయులకు గానీ, చైనా భాష తెలిసినవారికి కానీ ఇస్తున్నారు. దీంతో స్థానికుల్లో అసంతృప్తి నెలకొంది. దీనిని అవసరాలకు తగినట్లు సైనిక స్థావరంగా మార్చుకొనేలా నిర్మాణాలు జరుగుతున్నాయి. 
మరోపక్క చైనాకు చెందిన మరో కంపెనీ డీప్‌సీ పోర్టును నిర్మిస్తోంది. ఇది కంబోడియా అవసరాలు మొత్తం తీర్చే స్థాయిలో ఉంటోంది. పోర్టు టెర్మినల్స్‌ పొడవు దాదాపు 5కిలోమీటర్లకు పైగానే ఉంది. ఇక్కడే మరో మతలబు ఉంది. ఇంత పెద్ద పోర్టు నిర్మిస్తున్న చైనా రిసార్టు 10 కిలోమీటర్ల ఉత్తరాన మరో చిన్న పోర్టు నిర్మాణం చేపట్టింది. ఇదే అనుమానాలకు తావిస్తోంది. 500మీటర్ల పొడవు.. 900 మీటర్ల వెడల్పుతో దీనిని నిర్మిస్తోంది. దీనికితోడు అవసరమైన భవన నిర్మాణాలను కూడా చేపడుతోంది. ఈ పోర్టులో నావికాదళ నౌకలను కూడా నిలపే అవకాశం ఉంది. మరోపక్క దరా సకోర్‌కు 10కిలోమీటర్ల  దూరంలో 3,200 మీటర్ల పొడవు.. 50 మీటర్ల వెడల్పైన రన్‌వేతో ఒక విమానాశ్రయాన్ని నిర్మిస్తోంది.  దీనిపై పౌరవిమానాలతో పాటు సైనిక విమానాలు కూడా దిగేలా నిర్మిస్తున్నారు. ఇవన్నీ చూస్తుంటే కంబోడియా మరో హంబన్‌టోట అయ్యే ప్రమాదం సమీప భవిష్యత్తులో పొంచి ఉంది. 

Source : Eenadu