రాజధాని నిర్మాణం..అవినీతి కూపం: బొత్స

260619botsa brk
PTI | Updated :June 26, 2019,16:36 IST

అమరావతి: రాజధాని నిర్మాణం వ్యవహారంలో అన్ని అంశాలపైనా సీఎం జగన్‌ సమీక్షించారని.. ఏ అంశాన్ని చూసినా పెద్ద కుంభకోణం కనిపిస్తోందని ఏపీ పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి బొత్స అన్నారు. ల్యాండ్‌ పూలింగ్‌, నిర్మాణాలు, భూ కేటాయింపుల్లో భారీ ఎత్తున అవినీతి జరిగిందని చెప్పారు. సీఆర్‌డీఏపై సీఎం జగన్‌ సుమారు 3 గంటలపాటు సమీక్ష నిర్వహించారు. సమీక్ష ముగిసిన అనంతరం బొత్స మీడియాతో మాట్లాడారు. గత ప్రభుత్వ హయాంలో రాజధానిలో జరిగిన అక్రమాలపై విచారణ చేపడతామని ఆయన స్పష్టం చేశారు. ఈ అంశాన్ని లోతుగా పరిశీలించాలని అధికారులను సీఎం ఆదేశించినట్లు చెప్పారు. బలవంతపు భూసేకరణకు తమ ప్రభుత్వం వ్యతిరేకమని బొత్స చెప్పారు. 

రాజధాని నిర్మాణం అవినీతి కూపంలా మారిందని బొత్స విమర్శించారు. కుంభకోణం వివరాలు తేలాక రాజధాని అభివృద్ధి సంగతి చూస్తామని ఆయన వ్యాఖ్యానించారు. రాజధాని నిర్మాణంలో ప్రజాధనం భారీగా దుర్వినియోగం అయిందని.. రూ.100తో అయ్యే పనికి రూ.150 ఖర్చు చేశారన్నారు. తమకు కావాల్సిన వాళ్లకు అనుకూలంగా.. పేదలకు మాత్రం ఇష్టారాజ్యంగా ప్లాట్లు కేటాయించారని చెప్పారు. ప్రజావేదిక నుంచే అక్రమ నిర్మాణాల కూల్చివేత ప్రారంభమైందని.. ఈ ప్రక్రియ కొనసాగుతుందని బొత్స స్పష్టం చేశారు. ఈ విషయంలో చట్టం తన పని తాను చేసుకుని పోతుందని చెప్పారు.

Source : Eenadu