బాక్సైట్‌ తవ్వకాల జీవోలు రద్దుచేస్తాం: జగన్‌

25jagabbrk1a
PTI | Updated :June 25, 2019,16:47 IST

అమరావతి: రాష్ట్రంలో బాక్సైట్‌ తవ్వకాలకు సంబంధించిన జీవోలను రద్దుచేస్తామని ఏపీ ముఖ్యమంత్రి జగన్‌ వెల్లడించారు. గిరిజనులు వద్దన్నప్పుడు తవ్వకాలు ఎందుకు చేయాలో అర్థంలేదన్నారు. మైనింగ్‌ జరగకపోతే రాష్ట్రానికి వచ్చిన నష్టమేమీ లేదని ప్రజావేదికలో రెండోరోజు జరిగిన ఐఏఎస్‌, ఐపీఎస్‌ల సదస్సులో సీఎం అన్నారు. యువకులు మావోయిస్టులుగా మారకుండా గిరిజన ప్రాంతాల్లో తగిన చర్యలు తీసుకోవాలని సూచించారు. గిరిజనుల జీవనోపాధికి అవసరమైన అన్ని చర్యలూ తీసుకోవాలని, నెలకోసారి అన్ని శాఖల అధికారులూ మావోయిస్టు ప్రాంతాల్లోకి వెళ్లాలని ఆదేశించారు. ప్రభుత్వం నుంచి సేవలందుతున్నాయన్న భావన గిరిజనుల్లో కలగాలన్నారు. గిరిజనుల సమస్యలను పరిష్కరించి వారి అభిమానాన్ని చూరగొనాలని సూచించారు.

 అగ్రిగోల్డ్‌ బాధితులకు వెంటనే సాయం అందాలి

అగ్రిగోల్డ్‌ బాధితులకు వెంటనే సాయం అందించేలా చూడాలని జగన్‌ ఆదేశించారు.  అగ్రిగోల్డ్‌ యాజమాన్యం, బాధితులు, సీఐడీ అధికారులతో భేటీ అవుతానని చెప్పారు. అగ్రిగోల్డ్‌ ఆస్తుల స్వాధీనం వేగంగా జరగాలని ఈ సందర్భంగా ముఖ్యమంత్రి అధికారులకు సూచించారు. అగ్రిగోల్డ్‌ యాజమాన్యానికి చెందిన విలువైన ఆస్తులపైనా దృష్టిపెట్టాలన్నారు. 

Source : Eenadu