ప్రజల సహకారంతో ‘నవభారత్‌’: ప్రధాని మోదీ

250619modi brkk
PTI | Updated :June 25, 2019,16:44 IST

దిల్లీ: ఇటీవల జరిగిన ఎన్నికలు చాలా ప్రత్యేకమైనవని.. ఐదేళ్లలో తాము అందించిన పరిపాలనకు ఫలితాలు అద్దం పట్టాయని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. ఓటు వేసే ముందు ప్రజలు ఎన్నో రకాలుగా ఆలోచించి వేశారని చెప్పారు. లోక్‌సభలో రాష్ట్రపతి ప్రసంగంపై ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై ప్రధాని మాట్లాడారు. తమపై భరోసా ఉంచిన ప్రజలకు ఆయన ధన్యవాదాలు తెలిపారు. తమ ప్రభుత్వం ఎప్పుడూ పేద ప్రజలకు అండగా ఉంటుందని.. అధికారంలో ఉన్నపుడు వారికోసం ఏం చేశామనే ఆలోచిస్తామన్నారు.  మహా పురుషుల ఆకాంక్షలు నెరవేర్చే దిశగా ముందుకెళ్తామని చెప్పారు. స్పీకర్‌ కొత్తగా వచ్చిన సభ్యులకు కూడా అవకాశమిచ్చారని.. వారు సైతం చక్కగా మాట్లాడారని ప్రధాని కితాబిచ్చారు.

మా లక్ష్యం నుంచి పక్కకు వెళ్లబోం

‘‘గిరిజనులు, ఆదివాసీలు కూడా మా ప్రభుత్వాన్ని నమ్మి ఓటు వేశారు. మేం ప్రయాణించే మార్గం చాలా సుదీర్ఘమైంది. 70 ఏళ్ల నుంచి ఉన్న పరిస్థితి మారేందుకు సమయం పడుతుంది. మా ముఖ్య లక్ష్యం నుంచి ఎట్టి పరిస్థితుల్లోనూ పక్కకు వెళ్లబోం. ప్రజల సహకారంతో నవ భారత్‌ను నిర్మిస్తాం. గాంధీజీ సామాన్య ప్రజలను కూడా స్వాతంత్ర్య ఉద్యమంలోకి దించారు. గాంధీ పిలుపుతో క్విట్‌ ఇండియా ఉద్యమంలో ప్రజలంతా పాల్గొన్నారు. సామాన్య ప్రజలు తమ హక్కుల కోసం వ్యవస్థలతో పోరాడుతున్నారు. అనేక ఇబ్బందులను అధిగమించి దేశం ముందుకెళ్లాల్సిన అవసరం ఉంది. రాష్ట్రాల అభివృద్ధికి తగిన చేయూత అందిస్తున్నాం. రహదారులు, ఓడరేవులు, అభివృద్ధి చేస్తున్నాం. మౌలిక వసతుల కల్పనలో మా నిబద్ధతను ప్రజలు గమనించారు. ఇవాళ అత్యయిక పరిస్థితి విధించిన రోజు. నాటి చీకటి రోజులను ఎలా మరిచిపోగలం? స్వాతంత్ర్యం కోసం అనేక మంది ధైర్యవంతులు ప్రాణాలు అర్పించారు. ఆ సమరయోధుల కలలను సాకారం చేయాల్సిన బాధ్యత మనపై ఉంది’’ అని మోదీ అన్నారు.

Source : Eenadu