మానవత్వం చాటుకున్న సీఎం జగన్‌!

040619slider brk107703 %281%29
PTI | Updated :June 04, 2019,16:10 IST

విశాఖ: ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత తొలిసారి విశాఖ వెళ్లిన జగన్‌ మోహన్‌రెడ్డి తన మానవత్వాన్ని చాటుకున్నారు. శారదా పీఠాధిపతి స్వరూపానంద స్వామి ఆశీస్సులు తీసుకొని తిరుగు పయనంలో.. విశాఖ విమానాశ్రయం వద్ద ఓ బ్యానర్‌ను చూసి చలించిన ఆయన క్యాన్సర్‌ వ్యాధితో బాధితుడికి అభయమిచ్చారు. ప్రాణాపాయ స్థితిలో ఉన్న నీరజ్‌ను కాపాడాలంటూ బ్యానర్‌ను పట్టుకున్న అతడి స్నేహితుల వద్దకు వెళ్లిన జగన్‌.. అక్కడే ఉన్న విశాఖ జిల్లా కలెక్టర్‌ కాటమనేని భాస్కర్‌ను పిలిచి శస్త్రచికిత్సకు అయ్యే నిధుల్ని తక్షణమే మంజూరు చేయాలని సీఎం ఆదేశించారు.
బాధితుడు నీరజ్‌ కుమార్‌ విశాఖ ఉత్తర నియోజకవర్గంలో 38వ వార్డులో నివసిస్తున్నాడు. గత కొంతకాలంగా క్యాన్సర్‌ వ్యాధితో బాధపడుతూ బసవతారకం ఆస్పత్రిలో వైద్యం పొందుతున్నాడు. క్యాన్సర్‌ నయం కావాలంటే రూ.20లక్షలు ఖర్చవుతుందని వైద్యులు తెలిపారు. ఈ నేపథ్యంలో సీఎం జగన్‌ విశాఖకు రావడంతో నీరజ్‌ స్నేహితులు విమానాశ్రయం వద్ద బ్యానర్‌ పట్టుకొని నిలబడ్డారు. ఆ బ్యానర్‌ను చూసి స్పందించిన ముఖ్యమంత్రి జగన్‌.. క్యాన్సర్‌ వ్యాధితో బాధపడుతున్న నీరజ్‌కు సాయం చేయాలంటూ ఆదేశాలు జారీచేశారు. 

Source : Eenadu