రాళ్లపల్లి.. చక్కని స్నేహశీలి: చిరంజీవి

170519chiru slider
PTI | Updated :May 17, 2019,17:59 IST

 

హైదరాబాద్‌: ప్రముఖ సినీనటుడు రాళ్లపల్లి మృతిపై మెగస్టార్‌ చిరంజీవి దిగ్భ్రాంతి వ్యక్తంచేశారు. రాళ్లపల్లితో తనకు ఉన్న జ్ఞాపకాలను నెమరువేసుకున్నారు. తొలిసారి చెన్నైలోని వాణి మహల్‌లో నాటకాలు వేస్తున్నప్పుడు ఆయనను కలిశానని గుర్తుచేసుకున్నారు. రాళ్లపల్లి నటనను తానెంతో అభిమానించేవాడిని. చెన్నైలో తొలిసారి నేను ఆయన నటనను స్టేజ్‌పై చూసి ముగ్ధుడినయ్యా. ఆయన నటనను ఎంతో అభిమానించే వాడిని. ఆ తర్వాత  రాళ్లపల్లి వెండి తెరపైకి వచ్చారు. నాతో కలిసి పలు సినిమాల్లో నటించిన సందర్భంలో ఆయనతో అనుబంధం ఏర్పడింది. ఎక్కడ కలిసినా ఆప్యాయంగా మాట్లాడేవారు. చక్కని స్నేహశీలి.. చాలా రోజుల తర్వాత ఆ మధ్య 'మా' ఎన్నికల సందర్భంగా కలుసుకున్నాం. ఆ సందర్భంలో 'ఎలా ఉన్నావు మిత్రమా?' అంటూ ఇద్దరం ఒకరినొకరం పరస్పరం పలకరించుకున్నాం. అదే ఆఖరి చూపు అయ్యింది. ఇంతలోనే ఆయన తనువు చాలించారంటే చాలా బాధగా అనిపిస్తోంది. రాళ్లపల్లి ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నా.. రాళ్లపల్లి కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతి తెలుపుతున్నా’’ అని చిరంజీవి అన్నారు. 
గత కొంతకాలంగా శ్వాసకోశ వ్యాధితో బాధపడుతున్న రాళ్లపల్లి వెంకట నర్సింహారావు శుక్రవారం మాదాపూర్‌లోని మ్యాక్స్‌క్యూర్‌ ఆస్పత్రిలో చికిత్సపొందుతూ తుది శ్వాస విడిచిన విషయం తెలిసిందే. 850కి పైగా చిత్రాల్లో నటించిన ఆయన తెలుగు ప్రేక్షకులకు ఎంతో వినోదాన్ని పంచి విలక్షణ నటుడిగా మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. వినూత్నమైన పాత్రల్లో నటించి ప్రేక్షకుల్ని అలరించిన ఆయన ఐదు నంది అవార్డులను సొంతం చేసుకున్నారు.

Source ; Eenadu