ప్రముఖ సీనియర్‌ నటుడు రాళ్లపల్లి కన్నుమూత

17rallapally1a
PTI | Updated :May 17, 2019,15:35 IST

హైదరాబాద్‌: ప్రముఖ సినీ నటుడు రాళ్లపల్లి వెంకట నర్సింహారావు (73) కన్నుమూశారు. శ్వాసకోశ సంబంధిత వ్యాధితో గత కొంతకాలంగా బాధపడుతున్న ఆయన ఈ రోజు తన నివాసంలో అస్వస్థతకు గురికావడంతో కుటుంబ సభ్యులు ఆస్పత్రిలో చేర్పించారు. ఆరోగ్య పరిస్థితి విషమించడంతో శుక్రవారం సాయంత్రం మాదాపూర్‌లోని మ్యాక్స్‌క్యూర్‌ ఆస్పత్రిలో చికిత్సపొందుతూ తుదిశ్వాస విడిచారు. 1979లో ‘ కుక్కకాటుకు చెప్పుదెబ్బ’తో సినీ రంగ ప్రవేశం చేసిన రాళ్లపల్లి.. శుభలేఖ, ఖైదీ, ఆలయశిఖరం, మంత్రిగారి వియ్యంకుడు, అభిలాష, శ్రీవారికి ప్రేమలేఖ, సితార, ఆలాపన, న్యాయానికి సంకెళ్లు, ఏప్రిల్‌ 1 విడుదల, సూర్య, ఐపీఎస్‌, దొంగపోలీసు, కన్నయ్య కిట్టయ్య, సుందరాకాండ, భలే భలే మగాడివోయ్‌ తదితర 850కి పైగా చిత్రాల్లో నటించారు.

తెలుగు, తమిళ చిత్రాల్లో హాస్యనటుడిగా ప్రేక్షకుల్లో విశేష ఆదరణ పొందారు. దాదాపు 3 దశాబ్దాలకుపైగా సినీ పరిశ్రమకు ఆయన సేవలందించారు. తూర్పుగోదావరి జిల్లా రాచపల్లిలో 1955 అక్టోబర్‌ 10న జన్మించిన రాళ్లపల్లికి విద్యార్థి దశ నుంచే నాటకాల పట్ల ఎంతో మక్కువ. ఆ ఇష్టంతోనే 1979లో సినీ రంగ ప్రవేశం చేశారు. కేవలం హాస్యనటుడిగానే కాకుండా విభిన్న పాత్రల్లో ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. విలక్షణ నటుడ్ని కోల్పోయినందుకు సినీ అభిమానులు తీవ్ర దిగ్బ్రాంతి వ్యక్తం చేస్తున్నారు. రాళ్లపల్లి పార్థివ దేహాన్ని ఆస్పత్రి నుంచి మోతీనగర్‌లోని ఆయన నివాసానికి తరలించారు.

Source : Eenadu