ప్రపంచకప్‌ ప్రైజ్‌మనీ ఎంతో తెలుసా?

Icc cricket world cup 784x4
PTI | Updated :May 17, 2019,15:38 IST

గెలిచిన జట్టుకి భారీ నజరానా

లార్డ్స్‌: మే 30 నుంచి ఇంగ్లండ్‌, వేల్స్‌లో ప్రారంభమయ్యే ప్రపంచకప్‌ 2019 వేడుకకు సర్వం సిద్ధమైంది. ఐపీఎల్‌ ముగియడంతో కొందరు ఆటగాళ్లు కుటుంబంతో సమయం గడుపుతుండగా మరికొందరు తీవ్రంగా శ్రమిస్తున్నారు. ఈసారి ఇంగ్లండ్‌, భారత్‌, ఆసీస్‌ జట్లు బలంగా కనిపిస్తున్నాయి. మరోవైపు మిగతా జట్లని తక్కువ అంచనావేయలేని పరిస్థితి.

ఇదిలా ఉండగా ఈసారి కప్‌ అందుకోబోయే జట్టుకు ఐసీసీ భారీ నజరానా ప్రకటించింది. విశ్వవిజేతగా నిలిచిన జట్టుకు అత్యధికంగా నాలుగు మిలియన్‌ డాలర్ల నగదు బహుమతి లభించనుంది. అంటే భారత కరెన్సీలో దాదాపు రూ.28 కోట్లకుపైగానే. అలాగే రన్నరప్‌కు రెండు మిలియన్‌ డాలర్లు(రూ.14 కోట్లకుపైగా), సెమీఫైనల్లో ఓటమిపాలైన రెండు జట్లకు చెరో 8 లక్షల డాలర్లు(దాదాపు రూ.5కోట్లకుపైగా) అందుతాయి. లీగ్‌ దశలో గెలిచే ప్రతి మ్యాచ్‌కు 40 వేల డాలర్ల చొప్పున విజేతలు గెలుచుకోనున్నారు. ఇక లీగ్‌ దశలోనే నిష్క్రమించే ప్రతీ జట్టుకు లక్ష డాలర్లు నగదు నజరానా అందనుంది. 

మొత్తం 46 రోజుల సంగ్రామం మే 30 నుంచి జులై 14 వరకు కొనసాగనుంది. 45 మ్యాచులు రౌండ్‌రాబిన్‌ పద్ధతిలో జరగనున్నాయి. ప్రతీ జట్టు మిగతా జట్లతో ఒక్కో మ్యాచ్‌ ఆడాలి. లీగ్‌దశ ముగిసేసరికి ఎవరైతే తొలి నాలుగు స్థానాల్లో నిలుస్తారో వారే సెమీఫైనల్‌కు అర్హత సాధిస్తారు. జులై 9న ఎడ్జ్‌బాస్టన్‌లోని ఓల్డ్‌ ట్రఫోర్డ్‌లో ఒక సెమీఫైనల్‌,  11న ఎడ్జ్‌బాస్టన్‌లోని బర్మింగ్‌హామ్‌లో మరో సెమీఫైనల్‌ జరుగుతుంది. ఇక చివరగా జులై 14న ప్రతిష్ఠాత్మక మైదానం లార్డ్స్‌లో తుదిపోరు ఉండనుంది.

ఇంగ్లండ్‌, వేల్స్‌ సంయుక్తంగా ఇదివరకు 1975, 1979, 1983, 1999లో ప్రపంచకప్‌ వేడుకలు నిర్వహించాయి. ఇరవై ఏళ్ల తర్వాత మళ్లీ ఇప్పుడు అక్కడ ఈ మెగా ఈవెంట్‌ జరగనుంది. అయితే ఆసీస్‌ జట్టు అత్యదికంగా ఐదుసార్లు ఛాంపియన్‌గా నిలిచింది. వెస్టిండీస్‌, భారత్‌ రెండేసిసార్లు, పాక్‌, శ్రీలంక జట్లు చెరోసారి ఛాంపియన్లుగా నిలిచాయి.

Source ; Eenadu