జులై చివరి నుంచే కాళేశ్వరం నీటినిఎత్తిపోయాలి

16kcrbrk1a
PTI | Updated :May 16, 2019,17:40 IST

అధికారులకు సీఎం కేసీఆర్‌ ఆదేశం

హైదరాబాద్‌: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన కాళేశ్వరం ప్రాజెక్టుపై సీఎం కేసీఆర్‌ గురువారం సమీక్ష నిర్వహించారు. ప్రాజెక్టులో జరుగుతున్న పనుల వివరాలను ఆయన అధికారులను అడిగి తెలుసుకున్నారు. కాళేశ్వరం ప్రాజెక్టులో నీటిని లిఫ్టు చేసేందుకు అవసరమైన విద్యుత్‌ సరఫరా చేసే అంశంపై  ప్రగతిభవన్‌లో ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. కాళేశ్వరం ప్రాజెక్టు నిర్వహణకు అవసరమైన విద్యుత్‌ సరఫరా చేయడానికి కావాల్సిన వ్యవస్థలను శరవేగంగా పూర్తిచేశారంటూ కేసీఆర్‌ విద్యుత్‌ సంస్థలను అభినందించారు. విధించిన గడువు కంటే పనులు పూర్తిచేశారని, సహజంగా ఇంత త్వరగా పనులు పూర్తికావని తెలిపారు. ఇదే స్ఫూర్తితో కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా మూడు టీఎంసీల నీటిని లిఫ్టు చేయడానికి అవసరమైన అదనపు ఏర్పాట్లను కూడా వేగంగా పూర్తిచేయాలన్నారు. ఈ వర్షాకాలానికి ప్రాజెక్టు నుంచి నీళ్లు పరుగులు పెట్టించాలని ఆదేశించారు. 

19న కాళేశ్వరానికి సీఎం
ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఈ నెల 18న రామగుండంలో, 19న కాళేశ్వరంలో పర్యటించనున్నారు. 18న రామగుండంలో ఉన్న 1600 మెగావాట్ల ఎన్టీపీసీ పవర్‌ప్లాంట్‌ను సందర్శిస్తారు. అక్కడే ఎన్టీపీసీ, జెన్‌కో అధికారులతో సమీక్ష నిర్వహిస్తారు. 19న ఉదయం కాళేశ్వరం దేవాలయంలో పూజలు నిర్వహించిన అనంతరం కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణ ప్రాంతాల్లో కొనసాగుతున్న పనుల్ని సీఎం పరిశీలిస్తారు.

Source : Eenadu