ఎన్నికల సంఘంపై టీడీపీ ఎంపీ అనుచిత వ్యాఖ్యలు

Cmramesh
PTI | Updated :May 16, 2019,22:11 IST

ఢిల్లీ: కేంద్ర ఎన్నికల సంఘంపై టీడీపీ ఎంపీ సీఎం రమేష్‌ అనుచిత వ్యాఖ్యలు చేశారు. తమ ప్రభుత్వం వచ్చాక ఎన్నికల సంఘంపై ఎంక్వైరీ చేసి పని పడతామని హెచ్చరికలు చేశారు. ఏ నివేదిక లేకుండా రీపోలింగ్‌కు ఎలా ఆదేశించారని ఎన్నికల సంఘంపై సీఎం రమేష్‌ చిందులు తొక్కారు. ఈ మొత్తం వ్యవహారంపై కోర్టుకు వెళ్తామని, పార్లమెంటులో ఎంక్వైరీ చేస్తామని వింతగా మాట్లాడారు. కేంద్ర ఎన్నికల సంఘం కార్యాలయం ముందు నిలబడి ఇది బీజేపీ ఎన్నికల సంఘం అంటూ సీఎం రమేష్‌ పొంతనలేని వ్యాఖ్యలు చేశారు.

రీపోలింగ్‌కు ఆదేశించిన ఐదు పోలింగ్‌ బూత్‌ల్లో టీడీపీకి వన్‌సైడ్‌గా ఓట్లు పడుతుంటాయని అన్నారు. చరిత్ర చూస్తే ఈ బూతులన్నీ టీడీపీవేనని తెలుస్తుందన్నారు. ఐదు బూత్‌ల్లో టీడీపీకే ఓట్లు పడ్డాయని పరోక్షంగా సీఎం రమేష్‌ వెల్లడించారు. ప్రశ్నలడిగిన మీడియాపై కూడా సీఎం రమేష్‌ చిందులేశారు. రీపోలింగ్‌కు భయపడుతున్నారా అని ఓ మీడియా ప్రతినిధి ప్రశ్నించగా.. నీకు బుద్ధి ఉండే అడుగుతున్నావా అని వంకర టింకర సమాధానాలు చెబుతూ సీఎం రమేష్‌ బెదిరింపులకు దిగారు.

Source : Sakshi