కోహ్లీసేనలో హార్దిక్‌ ప్రతిభకు సరిలేరు: వీరూ

2hardik
PTI | Updated :May 15, 2019,17:59 IST

దిల్లీ: టీమిండియా యువ ఆల్‌రౌండర్‌ హార్దిక్‌ పాండ్యపై మాజీ డ్యాషింగ్‌ ఓపెనర్‌ వీరేంద్ర సెహ్వాగ్‌ ప్రశంసల వర్షం కురిపించాడు. అతడికున్న ప్రతిభ జట్టులో మరెవరికీ లేదని అన్నాడు. ఈ మధ్యకాలంలో అతడి స్థానాన్ని మరెవరూ భర్తీచేయలేని విధంగా ఆడుతున్నాడని వెల్లడించాడు. ఈ మధ్యే ముగిసిన ఐపీఎల్‌ 12లో హార్దిక్‌ పాండ్య బ్యాటు, బంతితో తిరుగులేని విధంగా ఆడాడు. ముంబయి ఇండియన్స్‌ను నాలుగో సారి విజేతగా నిలపడంలో అతడెంతో కీలకంగా నిలిచాడు. 15 ఇన్నింగ్సుల్లో 191.42 స్ట్రైక్‌రేట్‌తో 402 పరుగులు చేయడమే కాకుండా 14 వికెట్లు తీశాడు. అత్యధిక వ్యక్తిగత స్కోరు 91.

‘బ్యాటింగ్‌, బౌలింగ్‌లో హార్దిక్‌ పాండ్య ప్రతిభకు సమీపంలో ఎవరూ లేరు. ఒకవేళ బీసీసీఐ ఎంపిక చేసిన 3డీ ఆటగాడు ఎవరైనా సమానంగా ఉండి ఉంటే పాండ్య తిరిగి జట్టుకు ఎంపికయ్యేవాడే కాదు’ అని సెహ్వాగ్‌ అన్నాడు. ప్రపంచకప్‌నకు ఎంపిక చేసిన 15 మంది సభ్యుల్లో హార్దిక్‌ ఒకడు. ఇంగ్లాండ్‌లో నిర్వహించే టోర్నీలో అతడు తన ముద్రను వేసే అవకాశం ఉంది. కాఫీ విత్‌ కరణ్‌ షో వివాదంతో నిషేధానికి గురైన హార్దిక్‌, కేఎల్‌ రాహుల్‌ ఐపీఎల్‌ 12లో అదరగొట్టిన సంగతి తెలిసిందే.

Source : Eenadu