చంద్రగిరిలో ఐదుచోట్ల రీపోలింగ్‌

Repolling1a
PTI | Updated :May 15, 2019,18:14 IST

కేంద్ర ఎన్నికల సంఘం అనుమతి 

దిల్లీ: ఆంధ్రప్రదేశ్‌లోని ఐదు పోలింగ్‌ కేంద్రాల్లో రీపోలింగ్‌కు కేంద్ర ఎన్నికల సంఘం (ఈసీఐ) ఆదేశాలు జారీచేసింది. చిత్తూరు జిల్లా చంద్రగిరి నియోజకవర్గం పరిధిలోని ఐదు పోలింగ్‌ కేంద్రాల్లో రీపోలింగ్‌ నిర్వహించాలని నిర్ణయించింది. రాష్ట్ర ఎన్నికల సంఘం రాసిన లేఖపై స్పందించిన ఈసీఐ ఈ నెల 19న ఉదయం 7గంటల నుంచి సాయంత్రం 6గంటల వరకు ఆయా బూత్‌ల పరిధిలో అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికల పోలింగ్‌ జరపాలని ఆదేశాలు జారీ చేసింది. 

ఈ నెల 10, 11 తేదీల్లో చంద్రగిరి నియోజవకర్గంలోని కొన్ని పోలింగ్‌ కేంద్రాల్లో రీపోలింగ్‌ జరపాలని రాష్ట్ర ఎన్నికల సంఘం నుంచి కేంద్ర ఎన్నికల సంఘానికి విజ్ఞాపనలు అందాయి. జిల్లాలోని ఎన్నికల అధికారులతో మాట్లాడిన రాష్ట్ర ఎన్నికల సంఘం రీపోలింగ్‌కు అనుమతివ్వాలని ఈసీఐకి నివేదించింది. దీన్ని పరిగణనలోకి తీసుకున్న కేంద్ర ఎన్నికల సంఘం చంద్రగిరి నియోజకవర్గం పరిధిలోని ఎన్‌.ఆర్‌ కమ్మపల్లె, కమ్మపల్లె, పులివర్తిపల్లె, కొత్తకండ్రిగ, వెంకట్రామపురంలో రీపోలింగ్‌కు అనుమతులు జారీచేసింది. రీపోలింగ్‌ను సజావుగా నిర్వహించేలా ఏర్పాట్లు చేయాలని ఆదేశించింది. 

చంద్రగిరి సిట్టింగ్‌ ఎమ్మెల్యే, వైకాపా నేత చెవిరెడ్డి భాస్కర్‌ రెడ్డి రాష్ట్ర ఎన్నికల సంఘాన్ని ఇటీవల కలిసి.. తన నియోజకవర్గంలో ఒక వర్గానికి సంబంధించిన వారి ఓట్లు వేయనీయకుండా చేశారంటూ ఫిర్యాదు చేశారు. దీంతో పాటు మరికొన్ని ఫిర్యాదులు రావడంతో అక్కడి పరిస్థితులపై నివేదిక తెప్పించుకున్న రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి ద్వివేది ఈసీఐకి లేఖ రాశారు. దీన్ని పరిశీలించిన ఈసీఐ ఐదు పోలింగ్‌ కేంద్రాల్లో రీపోలింగ్‌కు అనుమతిచ్చింది. 

Source : Eenadu