ఏపీ కేబినెట్‌ భేటీ వాయిదా!

7cabinet1a
PTI | Updated :May 07, 2019,17:37 IST

అమరావతి: ఈ నెల 10న జరగాల్సిన  ఆంధ్రపదేశ్‌ మంత్రివర్గ సమావేశం వాయిదా పడింది. కేబినెట్‌ భేటీ నిర్వహణపై సీఎస్‌ ఎల్వీ సుబ్రహ్మణ్యానికి సీఎం కార్యాలయం లేఖ పంపినప్పటికీ ముందస్తు అనుమతి కోసం కేంద్ర ఎన్నికల సంఘానికి సమాచారం ఇవ్వాల్సి ఉండటంతో సమావేశం వాయిదా పడింది. దీంతో ఈ భేటీ ఈ నెల 14న జరిగే అవకాశం ఉన్నట్టు సమాచారం. చంద్రబాబు కార్యాలయం లేఖ రాసిన నేపథ్యంలో అధికారులతో సమాలోచనలు జరిపిన సీఎస్‌.. ఎన్నికల కోడ్‌ అమలులో ఉన్నందున కేబినెట్‌ భేటీకి  కేంద్ర ఎన్నికల సంఘం అనుమతి తప్పనిసరని, రెండు రోజుల ముందే ఈసీఐకి సమాచారం ఇవ్వాల్సి ఉంటుందని వ్యాఖ్యానించారు. ఈ నేపథ్యంలో మంత్రివర్గ సమావేశం అజెండాను ముఖ్యమంత్రి కార్యాలయం సీఎస్‌కు పంపింది. ఫొని తుపాను, రాష్ట్రంలో కరవు పరిస్థితులతో పాటు నీటి ఎద్దడి, ఉపాధి హామీ కూలీలకు చెల్లింపుల్లో నెలకొన్న అడ్డంకుల తదితర అంశాలపై చర్చిస్తామంటూ అజెండా నోట్‌లో పేర్కొంది. సీఎంవో పంపిన అంశాలను ఆయా శాఖల కార్యదర్శలకు సీఎస్‌ పంపనున్నారు. వారి నుంచి సమాచారం వచ్చాక సీఎస్‌ నేతృత్వంలోని కమిటీ పరిశీలించి ఈసీకి పంపుతారు.

Source : Eenadu