అనౌన్స్‌మెంట్‌ లేకుండానే వెళ్లిపోయిన రైలు!

Rainbrk1a 1
PTI | Updated :May 06, 2019,16:46 IST

విశాఖ స్టేషన్‌లోనే ఉండిపోయిన 500 మంది ప్రయాణికులు

విశాఖ: విశాఖ నుంచి కాచిగూడ వెళ్లాల్సిన 07147 నంబర్‌ గల విశాఖ- కాచిగూడ ప్రత్యేక రైలు అనౌన్స్‌మెంట్‌ లేకుండానే వెళ్లిపోయింది. దీంతో ప్రయాణికులు తీవ్ర ఆందోళన వ్యక్తంచేశారు. సోమవారం రాత్రి 7.45 గంటలకు బయల్దేరాల్సిన ఈ రైలుకు సంబంధించిన సమాచారాన్ని డిస్ప్లే బోర్డులో గానీ, అనౌన్స్‌మెంట్‌ గానీ చేయకపోవడంతో సుమారు 500 మంది ప్రయాణికులు విశాఖ రైల్వే స్టేషన్‌లోనే వేచిచూస్తున్నట్టు సమాచారం. ఏ ప్లాట్‌ఫాం మీదకు వస్తుందో తెలియక వారంతా ఎదురుచూస్తున్న సమయంలోనే అది ఎనిమిదో నంబర్‌ ప్లాట్‌ ఫాం నుంచి బయల్దేరి వెళ్లిపోయింది. విషయం తెలుసుకున్న ప్రయాణికులంతా స్టేషన్‌మాస్టర్‌  కార్యాలయం ఎదుట ఆందోళనకు దిగారు. తాము ప్రయాణం చేయాల్సిన రైలుకు సంబంధించిన సమాచారం వెల్లడించకపోవడం వల్లే తామంతా రైలు తప్పామని, దీనికి రైల్వే అధికారులే బాధ్యత వహించాలన్నారు. తమకు అదనపు బోగీలు వేసి పంపాలంటూ డిమాండ్‌ చేశారు. అధికారుల నిర్లక్ష్యాన్ని నిరసిస్తూ ఆందోళనకు దిగిన ప్రయాణికుల్ని బుజ్జగించి వేర్వేరు రైళ్లలో వారిని పంపించేందుకు ఏర్పాట్లు చేశారు. 

Source : Eenadu