మరింత బలపడనున్న ఫొని!

010519uttarandhra slide
PTI | Updated :May 01, 2019,15:56 IST

రేపు, ఎల్లుండి భారీ నుంచి అతిభారీ వర్షాలు

3న తీరం దాటే అవకాశం

విశాఖ: బంగాళాఖాతంలో గంటగంటకూ బలపడుతున్న ఫొని తీవ్ర పెనుతుపానుగా రూపాంతరం చెందింది. క్రమంగా పశ్చిమ వాయువ్య దిశగా కదులుతూ తీరం వైపు పయనిస్తోంది. గడిచిన ఆరు గంటలుగా ఏడు కి.మీల వేగంతో కదులుతోంది. ఒడిశాలోని పూరీకి 660 కి.మీల దూరంలో.. విశాఖకు 400 కి.మీల దూరంలో తుపాను కేంద్రీకృతమై ఉన్నట్టు వాతావరణశాఖ అధికారులు తెలిపారు. తుపాను మరింత బలోపేతమయ్యే సూచనలు కనబడుతున్నట్టు చెబుతున్నారు. మే 3న మధ్యాహ్నం ఒడిశాలోని గోపాల్‌పూర్‌ - చాంద్‌బలి మధ్య తీరం దాటే అవకాశం ఉన్నట్టు తెలిపారు. తీరం దాటే సమయంలో గరిష్ఠంగా 185 కి.మీల వేగంతో ప్రచండ గాలులు వీచే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు. 

శ్రీకాకుళం జిల్లాపైనే అధిక ప్రభావం!

తుపాను ప్రభావంతో శ్రీకాకుళం, విజయనగరం జిల్లాల్లో రేపు, ఎల్లుండి భారీ నుంచి అతిభారీ వర్షాలు పడొచ్చని అధికారులు హెచ్చరిస్తున్నారు. శ్రీకాకుళం జిల్లాపై ఎక్కువ ప్రభావం ఉంటుందని అంచనా. విశాఖ జిల్లాలోనూ ఓ మోస్తరు వర్షాలు కురిసే  సూచనలు ఉన్నాయని విపత్తు నిర్వహణ శాఖ, ఆర్టీజీఎస్‌ వర్గాలు తెలిపాయి. తుపాను ప్రభావాన్ని ఎదుర్కొనేందుకు ఎక్కడికక్కడ ప్రత్యేక అధికారులను నియమించారు. మత్స్యకారులెవరూ వేటకు వెళ్లొద్దని ఆదేశించారు. గజ ఈతగాళ్లను అందుబాటులో ఉంచడంతోపాటు తీర ప్రాంతాల్లో పునరావాస కేంద్రాలను సిద్ధంచేశారు.

ఉత్తరాంధ్రలో మారిన వాతావరణం

ఫొని తుపాను నేపథ్యంలో ఉత్తరాంధ్ర జిల్లాల్లో వాతావరణ మార్పులు చోటుచేసుకుంటున్నాయి. విశాఖ, శ్రీకాకుళం నగరాలతో పాటు ఉత్తరాంధ్రలోని గ్రామీణ ప్రాంతాల్లో కొన్ని చోట్ల ఆకాశం మేఘావృతమై ఉంది. అక్కడక్కడా చిరుజల్లులు కూడా పడుతున్నాయి. ఈ నేపథ్యంలో శ్రీకాకుళం జిల్లా కలెక్టర్‌ నివాస్‌ అధికార యంత్రాంగాన్ని అప్రమత్తం చేశారు. జిల్లా వ్యాప్తంగా తుపాను ప్రభావం ఉండనున్న మండలాల పరిధిలో నేటి నుంచే 48 పునరావాస కేంద్రాలను ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు. జిల్లాలోని 11 మండలాల్లో 237 తుపాను ప్రభావిత గ్రామాలను జిల్లా యంత్రాంగం ముందస్తుగా గుర్తించింది. రేపు మధ్యాహ్నం నుంచి ఫొని తుపాను ప్రభావం అధికంగా ఉండే అవకాశం ఉంటుందని అధికారులు చెబుతున్నారు. గురు, శుక్రవారాల్లో జిల్లాలో వర్షపాతం ఎక్కువగా నమోదయ్యే అవకాశం ఉన్నందున వంశధార నదీతీరంలో 117 గ్రామాలు, నాగావళి నదీతీరంలో 107 గ్రామాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు. విద్యుత్‌ స్తంభాలు నేలకొరిగితే వెంటనే పునరుద్ధరణ చేపట్టేందుకు వీలుగా 6వేల స్తంభాలను సిద్ధం చేశారు. సహాయక చర్యల కోసం ఎన్డీఆర్‌ఎఫ్‌, ఎస్డీఆర్‌ఎఫ్‌, డీడీఆర్‌ఎఫ్‌ బృందాలతో పాటు 32 బోట్‌ టీమ్‌లను సిద్ధంగా ఉంచారు. 

తుపాను ప్రభావంపై సీఎస్‌ వీడియో కాన్ఫరెన్స్‌

తుపాను ప్రభావంపై రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎల్వీ సుబ్రమణ్యం జిల్లా కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు.  జిల్లా యంత్రాంగం పూర్తి అప్రమత్తంగా ఉండాలని ఆయన ఆదేశించారు. వ్యవసాయ, ఉద్యానవన, విద్యుత్, అగ్నిమాపక, వైద్య, జలవనరులు, గ్రామీణ నీటి సరఫరా తదితర శాఖల అధికారులు సమన్వయంతో అన్ని రకాల చర్యలు చేపట్టాలని సూచించారు. శ్రీకాకుళం జిల్లాలోని ఇచ్ఛాపురం, పలాస, టెక్కలి, నరసన్నపేట నియోజకవర్గాల పరిధిలో పర్యవేక్షక అధికారులుగా ఐఏఎస్‌లను నియమించాలని జిల్లా కలెక్టర్‌ నివాస్‌ సీఎస్‌ను కోరారు.