నిషేధంతో విలవిలలాడుతున్న టిక్‌-టాక్‌

Tik tok1
PTI | Updated :April 24, 2019,04:25 IST

చైనాకు చెందిన ప్రముఖ వీడియో యాప్‌ టిక్‌-టాక్‌ను భారత్‌లో నిషేధించిన సంగతి తెలిసిందే. దీంతో ఆర్థికంగా తమ సంస్థ నష్టపోతోందని, ఈ నష్టం రోజుకు 5లక్షల డాలర్లు ఉందని (సుమారు రూ.3.5కోట్లు) కంపెనీ తెలిపింది. అంతేకాదు, 250మంది ఉద్యోగాలపై ఉద్వాసన కత్తి వేలాడుతోంది. వీడియోలకు అదనపు హంగులు జోడించి స్నేహితులతో పంచుకునే టిక్‌-టాక్‌ యాప్‌ ఎంతో పాపులర్‌ అయింది. ప్రపంచ వ్యాప్తంగా ఈ యాప్‌ను 1 బిలియన్‌కు పైగా వినియోగిస్తుండగా, భారత్‌లో ఏకంగా 300మిలియన్ల మంది దీన్ని డౌన్‌లోడ్‌ చేసుకున్నారని తాజా గణాంకాల ద్వారా వెల్లడైంది. 

అయితే, ఈ యాప్‌ ద్వారా పోర్నోగ్రఫీ విస్తృతంగా వ్యాపిస్తుండటంతో సుప్రీంకోర్టు ఆందోళన వ్యక్తం చేసింది. దీంతో భారత్‌లో టిక్‌-టాక్‌ డౌన్‌లోడ్‌ను నిషేధిస్తూ ఆదేశాలు జారీ చేసింది. కోర్టు ఆదేశాల మేరకు కేంద్ర ఐటీ మంత్రిత్వశాఖ  రంగంలోకి దిగింది. యాపిల్‌, గూగుల్‌లు తమ యాప్‌స్టోర్స్‌ నుంచి టిక్‌టాక్‌ను తొలగించాయి. దీంతో టిక్‌-టాక్‌ కంపెనీ బైట్‌డ్యాన్స్‌ను నష్టాలు చుట్టు ముట్టాయి. ఈ నేపథ్యంలో బైట్‌ డ్యాన్స్‌ కోర్టును ఆశ్రయించింది. టిక్‌-టాక్‌పై ఉన్న నిషేధాన్ని ఎత్తివేయాలని ఈ మేరకు యాపిల్‌, గూగుల్‌ సంస్థలను ఐటీ మంత్రిత్వశాఖ ఆదేశించేలా ఉత్తర్వులు జారీ చేయాలని కోరింది. 

‘యాప్‌పై నిషేధం ఆర్థికంగా తీవ్ర ప్రభావాన్ని చూపుతోంది. అంతేకాదు, రోజుకు దాదాపు 1 మిలియన్ల కొత్త యూజర్లను కోల్పోతున్నాం.’ అని కంపెనీ తెలిపింది. అయితే దీనిపై సుప్రీంకోర్టు ఎలాంటి మధ్యంతర ఉత్తర్వులు జారీ చేయలేదు. వచ్చే బుధవారం ఈ కేసు విచారణకు రానుంది. 

 

Source : Eenadu