రీవాల్యుయేషన్‌కు అంత సమయమా?: హైకోర్టు

230419inter highcourt1
PTI | Updated :April 23, 2019,16:05 IST

హైదరాబాద్‌: తెలంగాణలో ఇంటర్‌ పరీక్ష ఫలితాల వివాదంపై బాలల హక్కుల సంఘం వేసిన పిటిషన్‌పై హైకోర్టులో విచారణ జరిగింది. ఫెయిలైన విద్యార్థులందరి జవాబు పత్రాలను మళ్లీ మూల్యాంకనం చేయాలని ఉన్నత న్యాయస్థానం అభిప్రాయపడింది. దీనికి ఎంత సమయం పడుతుందని అదనపు అడ్వొకేట్‌ జనరల్‌ని ప్రశ్నించింది. సుమారు 2 నెలలు పడుతుందన్న ఆయన వాదనపై హైకోర్టు అభ్యంతరం వ్యక్తం చేసింది. ఫెయిలైన 3లక్షల మంది విద్యార్థుల జవాబు పత్రాల మూల్యాంకనానికి అంత సమయం ఎందుకని ప్రశ్నించింది. ఈ విషయంలో సాధ్యాసాధ్యాలపై సోమవారం చెబుతామని అదనపు అడ్వొకేట్‌ జనరల్‌ ఉన్నత న్యాయస్థానానికి తెలిపారు. ఫలితాల్లో గందరగోళంపై విచారణకు ప్రభుత్వం ఆదేశించిందని పేర్కొంటూ జీవోను ఆయన సమర్పించారు. ఏజెన్సీ పనితీరుపై మాత్రమే విచారణకు ఆదేశించారని అభిప్రాయపడిన హైకోర్టు.. మొత్తం వ్యవహారాన్ని పరిశీలించాల్సిన అవసరం ఉందని వ్యాఖ్యానించింది. మరోవైపు దీనిపై న్యాయవిచారణకు ఆదేశించాలంటూ పిటిషనర్‌ తరఫు న్యాయవాది దామోదర్‌ రెడ్డి ఉన్నత న్యాయస్థానాన్ని కోరగా.. న్యాయవిచారణతో విద్యార్థులకు ప్రయోజనం ఉండదని వ్యాఖ్యానించింది. దీనిపై సోమవారంలోపు అభిప్రాయాన్ని చెప్పాలంటూ రాష్ట్ర ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది.

Source :  Eenadu