ఈసీ తీరు దుర్మార్గం చంద్రబాబు ఘాటు లేఖ

9ap main6a
PTI | Updated :April 10, 2019,05:26 IST

భాజపా, వైకాపా ఆదేశాలకు అనుగుణంగా తెదేపాను దెబ్బతీయడమే లక్ష్యంగా కేంద్ర ఎన్నికల సంఘం పని చేస్తోందని ముఖ్యమంత్రి చంద్రబాబు ఆరోపించారు. ఎన్నికల్ని స్వేచ్ఛగా, పారదర్శకంగా నిర్వహించాల్సిన స్వతంత్ర ప్రతిపత్తి కలిగిన ఈసీ పనితీరుపై ఆయన ధ్వజమెత్తారు. మంగళవారం కేంద్ర ఎన్నికల సంఘానికి ఈ మేరకు ఒక లేఖ రాశారు. రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సహా పలువురు అధికారులను ఎన్నికల సంఘం ఇటీవల బదిలీ చేయడాన్ని తప్పుబట్టారు.

లేఖలో చంద్రబాబు ప్రస్తావించిన కొన్ని ముఖ్యాంశాలు...
* కేంద్ర ఎన్నికల సంఘం విశ్రాంత ఐపీఎస్‌ అధికారి కె.కె.శర్మను ఆంధ్రప్రదేశ్‌కు పోలీసు పరిశీలకునిగా నియమించింది. ఇంతకు ముందు ఆయనను పశ్చిమబంగకు ప్రత్యేక పోలీసు పరిశీలకునిగా నియమిస్తే అక్కడి తృణమూల్‌ కాంగ్రెస్‌ తీవ్ర అభ్యంతరం తెలిపింది. దీంతో ఆయనను ఏపీకి మార్చారు. శర్మ నియామకంపట్ల తృణమూల్‌ ఎలాంటి ఆందోళన వ్యక్తం చేసిందో, అది ఏపీకీ వర్తిస్తుంది. ఆరెస్సెస్‌ నేపథ్యం ఉన్న అధికారిని పోలీసు పరిశీలకునిగా ని యమించడాన్ని చూస్తే ఎన్నికల సంఘం
నిష్పాక్షికంగా వ్యవహరించటం లేదన్న భావన కలుగుతోంది. వెంటనే ఆయనను బదిలీ చేయాలి.
* తెదేపా అభ్యర్థులు, నాయకులు, మద్దతుదారులే లక్ష్యంగా ఐటీ దాడులు చేస్తున్నారు. ఇది ఎన్నికల ప్రవర్తన నియమావళిని ఉల్లంఘించడమే కాకుండా, అన్ని పార్టీలకు సమాన అవకాశాలు కల్పించాలన్న స్ఫూర్తికి విరుద్ధం. ఇది పార్టీ కేడర్‌ నైతిక స్థైర్యాన్ని దెబ్బతీయడంతో పాటు, ఇతర పార్టీలను ప్రోత్సహించేలా ఉంది.
* భాజపా పాలిత రాష్ట్రాలు, తమిళనాడులో ఆరోపణలు వచ్చిన అధికారులపై ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదు. కేవలం ఏపీలాంటి రాష్ట్రాల్లోని అధికారులపైనే చర్యలు తీసుకుంటున్నారని 66 మంది విశ్రాంత అఖిల భారత సర్వీసుల అధికారులు మంగళవారం రాష్ట్రపతికి లేఖ రాశారు. ఎన్నికల సంఘాన్ని అంత మంది మాజీ అధికారులు తప్పుపట్టే పరిస్థితి రావడం దురదృష్టకరం.
* వృత్తి నిబద్ధతతో పనిచేస్తూ, సంఘ వ్యతిరేక శక్తులపట్ల కఠినంగా వ్యవహరిస్తున్న ప్రకాశం జిల్లా ఎస్పీ కోయ ప్రవీణ్‌ను ఎన్నికల సంఘం బదిలీ చేయడం పోలీసుశాఖకు తప్పుడు సంకేతాలు పంపింది. అదే ఎన్నికల సంఘం తప్పుడు ఫారం-7 దరఖాస్తులు చేసినవారిపై చర్యలు తీసుకోవడంలో విఫలమైంది. తెలంగాణ శాసనసభ ఎన్నికల సమయంలో 20 లక్షల మంది ఓటర్లు ఓటు హక్కు కోల్పోవడం పట్ల తెలంగాణ ఎన్నికల అధికారులు క్షమాపణ చెప్పడం ఇక్కడ ప్రస్తావనార్హం.
* శ్రీకాకుళం జిల్లా కలెక్టర్‌ను బదిలీ చేశారు. ఆయన అప్పటికి బాధ్యతలు స్వీకరించి ఒకరోజే అయింది. శ్రీకాకుళం, కడప ఎస్పీలతో పాటు ఇంటలిజెన్స్‌ డీజీని బదిలీ చేశారు. వారికి వివరణ ఇచ్చుకునే అవకాశం కూడా ఇవ్వలేదు.
* మంచి అధికారిగా పేరు తెచ్చుకున్న ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి పునేఠాను బదిలీ చేశారు. ఆయన స్థానంలో కొత్త అధికారిని నియమించేటప్పుడు కనీసం రాష్ట్ర ప్రభుత్వాన్ని సంప్రదించలేదు.
* వైకాపా ఎప్పుడు ఫిర్యాదు చేసినా ఎన్నికల సంఘం వెంటనే స్పందిస్తోంది. నిజానిజాలు నిర్ధారించుకోకుండా.. అధికారులు వివరణ ఇచ్చుకునే అవకాశం ఇవ్వకుండా చర్యలు తీసుకుంటోంది. 31 క్రిమినల్‌ కేసులు స్వయంగా ఎదుర్కొంటున్న ప్రతిపక్ష నాయకుడి నిరాధారణ ఆరోపణలకు ప్రాధాన్యమిస్తోంది. ఇదే సమయంలో తెదేపా ఇచ్చిన ఫిర్యాదుల విషయంలో ఎలాంటి చర్యలు తీసుకోలేదు.
* వైఎస్‌ వివేకానందరెడ్డి హత్యను వైకాపా అధ్యక్షుడు జగన్‌, ఆయన బంధువులు గుండెపోటుగా చిత్రీకరించాలని చూశారు. కేసు విచారణ జరుగుతుండగానే ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశారు. సహజ న్యాయసూత్రాలను పాటించని ఎన్నికల సంఘం పోలీసు అధికారిని వెంటనే బదిలీ చేసింది.
* ఆర్థిక నేరాల్లో ప్రమేయం ఉన్న ప్రతిపక్ష పార్టీ నేతలు ఎన్నికల సంఘాన్ని కలిసి ఫిర్యాదు చేయడం, బయటకు వచ్చి మరుసటి రోజే బదిలీ అవుతారని  చెప్పడం.. వెంటనే బదిలీ కావడం తదితర పరిణామాలు చూస్తే తటస్థ ఓటర్లలో పలు అనుమానాలు రేకెత్తుతున్నాయి.

 

Source: Eenadu