టీడీపీ తుట్టెను కుట్టిన లో‘కేస్‌’!

Lokesh
PTI | Updated :March 09, 2019,04:29 IST

ఆయన చుట్టూనే టీడీపీ సీట్ల రాజకీయం

పుత్రుడి కోసం మంత్రి గంటా సీటుకు ఎసరు

అదేరీతిలో ఎంవీవీఎస్‌ మూర్తి మనుమడికి ఎంపీ సీటు నిరాకరణ

గంటాకు గాజువాక, చోడవరం, విశాఖ ఉత్తరలో ఏదో ఒకటి ఇస్తామని ఆఫర్‌

పెండింగులో పాయకరావుపేట, మాడుగుల సీట్లు

అయ్యన్న కొడుక్కీ టిక్కెట్‌ నిరాకరణ

అనకాపల్లి ఎంపీ స్థానానికి కొణతాల ఖరారు

విశాఖ ఎంపీకి పల్లా శ్రీనివాస్‌ లేదా గంటా

విశాఖలో ఇంతకాలం భద్రంగా, పటిష్టంగా ఉందని జబ్బలు చరుచుకున్న టీడీపీ నేతలకు ఒక్కసారి షాక్‌.. ఆ పార్టీ శ్రేణుల్లో భారీ కుదుపు. దీనికి కారణం.. ఒకే ఒక్కడు.. ముఖ్యమంత్రి ముద్దుల తనయుడు లోకేష్‌..!పుత్రరత్నానికి చోటు కల్పించాలన్న ఆత్రంలో చంద్రబాబు విశాఖ టీడీపీ తుట్టెను కదిపారు.. అభ్యర్థిత్వాలను ఇష్టానుసారం కెలికి.. తమ సీట్లు భద్రమన్న ధీమాతో ఉన్న సిటింగులను కలవరపాటుకు గురిచేశారు. లోకేష్‌ కోసం మంత్రి గంటాను పక్కకు నెట్టేశారు. ఆయన్ను మరో నియోజకవర్గం చూసుకోమంటూ మూడు ఆప్షన్లు ఇచ్చారు. ఫలితంగా మంత్రితోపాటు మరో ముగ్గురు సిట్టింగులు కినుక వహించారు. అదే లోకేష్‌ కోసం.. చనిపోయేవరకు టీడీపీకి పెద్ద దిక్కుగా ఉన్న ఎంవీవీఎస్‌మూర్తి మనవడు భరత్‌కూ మొండి చెయ్యి చూపారు. విశాఖ పార్లమెంట్‌ టికెట్‌ ఆశించిన ఆయన్ను ఆశాభంగానికి గురి చేశారు.రెండురోజులుగా అమరావతిలో జరుగుతున్న విశాఖ టీడీపీ టికెట్ల పంచాయితీ సీట్ల కేటాయింపులను కొలిక్కి తేకపోగా.. అసంతృప్తిని మాత్రం రాజేసింది.

 విశాఖపట్నం:  ఇప్పుడు విశాఖ ‘దేశం’ మొత్తం లోకేష్‌ చుట్టూ తిరుగుతోంది. మంత్రి లోకేష్‌ భీమిలి నుంచి బరిలోకి దిగుతారని వారం క్రితం వార్తలొచ్చినప్పుడు ఆ పార్టీ నేతలతో సహా ఎవరూ పెద్దగా పట్టించుకోలేదు. కానీ రెండ్రోజులుగా అమరావతిలో జరుగుతున్న టీడీపీ సీట్ల పంచాయితీలో స్వయంగా  చంద్రబాబే లోకేష్‌ ప్రస్తావన తీసుకురావడంతో జిల్లా టీడీపీ ముఖచిత్రం మారిపోయే సూచనలు కన్పిస్తున్నాయి. మంత్రి గంటా శ్రీనివాసరావు ప్రాతినిధ్యం వహిస్తున్న భీమిలి నుంచి లోకేష్‌ను బరిలోకి దింపాలని పార్టీ అధినేత నిర్ణయానికి వచ్చినట్టుగా తెలుస్తోంది. ఈ పరిణమాం మంత్రి గంటా వర్గానికి మింగుడుపడటం లేదు.

అప్పుడే మార్పులకు బీజం
అనకాపల్లి ఎంపీ అవంతి శ్రీనివాసరావు వైఎస్సార్‌సీపీలో చేరి భీమిలి సమన్వయకర్తగా రంగంలోకి దిగడంతోనే టీడీపీ ఆలోచనలో పడిపోయింది. అవంతిపై ఏకంగా చినబాబునే రంగంలోకి దింపాలని నిర్ణయానికి వచ్చినట్టు చెబుతున్నారు. అయితే తానే భీమిలి నుంచే పోటీ చేస్తానని గంటా వాదించినప్పటికీ.. విశాఖ ఉత్తరం, గాజువాక, చోడవరాల్లో ఏదో ఒకటి ఎంచుకోవాలని చంద్రబాబు సూచించగా.. దానికి గంటా అయిష్టంగా ఉన్నట్టు అమరావతి నుంచి వార్తలొస్తున్నాయి. ఇదిలా ఉంటే పార్టీ రూరల్‌ జిల్లా అధ్యక్షుడు పంచకర్ల రమేష్‌బాబు ఎప్పటి నుంచో విశాఖ ఉత్తరం కోరుతున్నారు. అనకాపల్లి ఎంపీ సీటు ఆశిస్తున్న ఆడారి తులసీరావు కుమారుడు ఆనంద్‌ను యలమంచలి నుంచి బరిలోకి దింపనున్నట్టు అధినేత చెప్పగానే ఉత్తరానికి తనకు లైన్‌ క్లియర్‌ అయిందని పంచకర్ల సంబరపడ్డారు. కానీ ఆ ఆనందం ఎంతోసేపు నిలవలేదు. లోకేష్‌–గంటాల మధ్య సీట్ల పంపకం తెరపైకి రావడంతో ఒక్కసారిగా విశాఖ సిటీ పార్టీలో కుదుపు మొదలైంది. గంటాకు ఇచ్చిన మూడు ఆప్షన్లలో ఉత్తర సీటు కూడా ఉండటంతో పంచకర్ల సైతం అధినేత తీరుపై అసంతృప్తితో రగిలిపోతున్నట్టుగా తెలుస్తోంది.

కదిలిన తేనెతుట్టె
ఈ ముగ్గురి సీట్ల పంపకం జిల్లాలో ఇతర సీట్ల ఖరారుపై తీవ్ర ప్రభావం చూపే అవకాశాలు కన్పిస్తున్నాయి. మాడుగుల, పాయకరావుపేట మినహా మిగిలిన స్థానాలకు వ్యవహారం దాదాపు కొలిక్కి వచ్చినట్టుగా పార్టీ వర్గాలు చెబుతున్నాయి. చోడవరం విషయంలో సాయంత్రం వరకు పీటముడి వీడనప్పటికీ అధినేత మాత్రం సిట్టింగ్‌ ఎమ్మెల్యే కేఎస్‌ఎన్‌ రాజువైపే మొగ్గు చూపినట్టుగా చెబుతున్నారు. అయితే గంటాకు ఇచ్చిన ఆప్షన్లలో ఈ సీటు కూడా ఉండటం విశేషం. అనకాపల్లి ఎంపీ సీటును తన కుమారుడు విజయ్‌కు ఇవ్వాలని, తాను ఈసారి పోటీచేనని మంత్రి అయ్యన్న చేసిన ప్రతిపాదనను అధినేత తోసిపుచ్చారని చెబుతున్నారు. మళ్లీ నువ్వే నర్సీపట్నం నుంచి బరిలోకి దిగాలి, ఎందుకు భయపడతున్నావ్‌ అంటూ క్లాస్‌ పీకినట్టు సమాచారం. నీ కుమారుడు విజయ్‌కు మాత్రం అనకాపల్లి సీటు ఇవ్వలేనని తెగేసి చెప్పారంటున్నారు. అదే సమయంలో అనకాపల్లి ఎంపీ సీటును తన కుమారుడు ఆనంద్‌కు ఇవ్వాలన్న విశాఖ డెయిరీ చైర్మన్‌ ఆడారి తులసీరావు వినతిని సైతం తిరస్కరించిన చంద్రబాబు ఆనంద్‌ను యలమంచలి ఖరారు చేశారని అంటున్నారు.

సిటింగ్‌లపై అసమ్మతి గళం
అభ్యర్థుల ఎంపికపై రెండ్రోజులపాటు పార్టీ సమన్వయ కమిటీ సభ్యులతో చంద్రబాబు భేటీ అయ్యారు. వాడీవేడిగా సాగిన ఈ సమావేశాల్లో సిట్టింగ్‌లకు వ్యతిరేకంగా ఆశావాహులు, అసమ్మతి నేతలు గళమెత్తారు. మెజార్టీ సిట్టింగ్‌లు అవినీతి ఊబిలో కూరుకుపోయారని, వారికి సీట్లు ఇస్తే పార్టీ ఓటమి పాలవడం ఖాయమని తేల్చిచెప్పారు. పాయకరావుపేట, చోడవరం, మాడుగుల నియోజకవర్గ బేటీల్లో అసమ్మతి నేతలు సిట్టింగ్‌లకు వ్యతిరేకంగా బలంగానే తమ వాదన విన్పించారు.

లోకేష్‌ ప్రస్తావనతో అవాక్కు
లోకే‹ష్‌ని భీమిలి నుంచి బరిలోకి దింపాలన్న ఆలోచనలో అధినాయకత్వం ఉన్న నేపథ్యంలో ఈ అంశంపై సుదీర్ఘ చర్చ సాగింది. భీమిలి లేదా విశాఖ ఉత్తరం నియోజకవర్గాల్లో ఏదో చోటు నుంచి లోకేష్‌ను పోటీకి దింపాలని పార్టీ అధినేత తన మనసులో మాట బయట పెట్టడంతో నేతలకు ఏం మాట్లాడలో తెలియలేదు. ముఖ్యంగా మంత్రి గంటా, ఎమ్మెల్యే పంచకర్ల పరిస్థితి అయోమయంగా తయారైంది. ఈ నెల 17న పార్టీలోకి వచ్చేందుకు ఆసక్తి చూపుతున్న మాజీ మంత్రి కొణతాల రామకృష్ణను అనకాపల్లి పార్లమెంటు బరిలోకి దింపాలని యోచనలో ఉన్నట్టుగా బేటీలో ప్రస్తావించినట్లు చెబుతున్నారు. చోడవరం, మాడుగుల, పాయకరావుపేట సీట్లు మినహా మిగిలిన సీట్లన్నీ దాదాపు ఖరారైనట్టు తెలియవచ్చింది. అరుకు ఎంపీ సీటును మాజీ కేంద్ర మంత్రి కిషోర్‌ చంద్రదేవ్‌కే ఖరారైనట్టు చెబుతున్నారు. మరోవైపు విశాఖ ఎంపీ సీటు ఆశిస్తున్న పార్టీ దివంగత నేత ఎంవీవీఎస్‌ మూర్తి తనయుడు భరత్‌కు ఆశాభంగం ఎదురైంది. లోకేష్‌ ఇక్కడి నుంచే రంగంలోకి దిగుతున్నందున ఆయన తోడల్లుడైన భరత్‌కు అవకాశం ఇవ్వలేమని చంద్రబాబు తేల్చేశారు. విశాఖ పార్లమెంట్‌ నుంచి పల్లాశ్రీనివాస్, గంటాలలో ఒకరిని ఖరారు చేసే అవకాశం ఉంది.

అభ్యర్థులు వీరే!
అసెంబ్లీ సీట్ల విషయానికి వస్తే విశాఖ తూర్పు–వెలగపూడి రామకృష్ణబాబు, విశాఖ ఉత్తరం–గంటా శ్రీనివాసరావు లేదా పంచకర్ల రమేష్‌బాబు, విశాఖ దక్షిణం–వాసుపల్లి గణేష్‌కుమార్, విశాఖ పశ్చిమం– పీజేవీఆర్‌ నాయుడు(గణబాబు), గాజువాక–పల్లా శ్రీనివాసరావు లేదా గంటా శ్రీనివాసరావు, భీమిలి– నారా లోకేష్‌ లేదా గంటా శ్రీనివాసరావు, పెందుర్తి–బండారు సత్యనారాయణమూర్తి, నర్సీపట్నం– సీహెచ్‌ అయ్యన్న పాత్రుడు, అరుకు– మంత్రి కిడారి శ్రావణ్‌కుమార్, పాడేరు– గిడ్డి ఈశ్వరి అభ్యర్థిత్వాలు ఖరారైనట్టు పార్టీ సీనియర్‌ ఒకరు సాక్షికి చెప్పారు. పాయకరావుపేట, మాడుగుల సీట్ల విషయంలో పార్టీ స్పష్టత లేదని అంటున్నారు.

Source :  Sakshi