అందుకే ఐటీ గ్రిడ్‌ కేసు తెరపైకి తెచ్చారు: శివాజీ

Sivaji1
PTI | Updated :March 08, 2019,18:52 IST

తెలంగాణలో ఓట్ల తొలగింపు వ్యవహారాన్ని పక్కదారి పట్టించేందుకే ఐటీ గ్రిడ్‌ కేసు తెరపైకి తెచ్చారని సినీ నటుడు శివాజీ అన్నారు. తెలుగు రాష్ట్రాలను కుదిపేస్తున్న డేటా చౌర్యం అంశం ప్రధాని మోదీ కనుసన్నల్లోనే జరుగుతోందని ఆయన ఆరోపించారు. డేటా చోరీ అంశంపై శివాజీ విజయవాడలో విలేకరులతో మాట్లాడారు.

రైల్వేజోన్‌, హోదా అంశాన్ని పక్కన పెట్టారు!
‘‘అర్థం లేని డేటా చోరీ అంశాన్ని తెరమీదకు తెచ్చి రైల్వే జోన్, హోదా అంశాన్ని పక్కన  పెట్టారు. 2015లోనే తెలంగాణ రాష్ట్రంలో సమాచార చౌర్యం జరిగింది. ఓట్ల తొలగింపు కార్యక్రమాన్ని కేసీఆర్‌ తెలంగాణలో చేపట్టారు... నిజమో.. కాదో ఆయనే చెప్పాలి. అన్ని రాష్ట్రాల్లో  తెలంగాణ మాదిరిగా ఓట్లు తొలగించుకోవచ్చని ఎన్నికల కమిషన్‌ చెప్పడం సరికాదు. ఎన్నికల కమిషనర్‌ ఒక రాష్ట్ర ప్రభుత్వంతో కలసి చేయటం రాజ్యాంగ విరుద్ధం.  గ్రేటర్ హైదరాబాద్‌, నిజామబాద్ జిల్లాల్లో సెటిలర్లకు సంబంధించి సమగ్ర కుటుంబ సర్వే నిర్వహించారు.  అన్ని రాజకీయ పార్టీలు డేటా చౌర్యం చేస్తుంటాయి..  ప్రధాని మోదీకి సంబంధించిన నమో యాప్‌లో సుమారు 30 కోట్ల మంది ప్రజల డేటా ఉంది. ఒకవేళ డేటా చౌర్యం చేయాలంటే ఆఫీసు అమెరికాలో పెడతారు కానీ హైదరాబాద్‌లో పెట్టరు. రాజకీయ వ్యూహంలో భాగంగా రాష్ట్ర ప్రభుత్వాలు సిట్‌ను ఏర్పాటు చేశాయి’’ అని ఆరోపించారు. 

కేసీఆర్‌ ఫోన్‌ చేసి అడగాల్సిన అవసరం ఏంటి?
‘‘డేటా దొంగతనం అంతర్జాతీయ సమస్యలా భారతదేశంలో మొదటిసారి జరుగుతున్నట్లు రాజకీయ పార్టీలు ప్రచారం చేస్తున్నాయి. ఎన్నికల సంఘం స్వతంత్ర ప్రతిపత్తి కలిగిన సంస్థ. తెలంగాణ ఓట్ల గల్లంతు అనేది వారికి కుంభకోణం కాకపోవచ్చు. ఎవరు తీసిన గోతిలో వారే పడతారని తెలుసుకోవాలి. ఎన్నికల అధికారికి కేసీఆర్‌ ఫోన్‌ చేసి అడగాల్సిన పని ఏంటి? ఇది ఎన్నికల నియమావళికి విరుద్ధం. తెలంగాణ ప్రభుత్వం, ఈసీ మధ్య అవగాహన ఒప్పందం కుదిరింది. ఓట్లు తొలగించే ముందు సమగ్ర సర్వే పూర్తి చేశారు. ఐటీశాఖ, ఈసీ కలిసి హైదరాబాద్‌లో ఓట్లు తొలగించేందుకు కుట్ర చేశాయి. అందుకు ఎస్‌ఆర్‌డీహెచ్‌ యాప్‌ను తయారు చేశారు. ఓట్లు తొలగించేందుకు సమగ్ర కుటుంబ సర్వేను వాడుకున్నరనేది నిజమా? కాదా?’’ అని ప్రశ్నించారు.

హైదరాబాద్‌ బ్రాండ్‌ వ్యాల్యూని చంపేశారు!
‘‘డేటా చౌర్యం చేసింది తెలంగాణ ప్రభుత్వమే. కేసీఆర్‌ను చూస్తే ఎందుకు భయపడాలి. హైదరాబాద్‌ బ్రాండ్‌ వ్యాల్యూను చంపేశారు. ఏపీ సర్కారు తప్పు చేస్తే కేంద్ర సంస్థలతో దర్యాప్తు చేయించాలి. ఓట్ల తొలగింపుపై అప్పట్లోనే మర్రి శశిధర్‌రెడ్డి ఫిర్యాదు చేశారు. హైదరాబాద్‌ ఉమ్మడి రాజధాని అనే విషయాన్ని తెలంగాణ ప్రభుత్వం గ్రహించాలి.’’ అని అన్నారు. తాను ఏ పార్టీకి చెందిన వాడిని కాదని, ప్రజల తరపున అన్ని ఆధారాలతో మాట్లాడుతున్నట్లు శివాజీ తెలిపారు.

 

Source: Eenadu