ఉప్పల్‌లో... ఆసీస్‌ 2 - భారత్‌ 0

Uppal stadium2
PTI | Updated :March 02, 2019,04:44 IST

ఉప్పల్‌ మైదానం భారత్‌ అంతగా కలసి రాదు అని అంటుండేవారు. కానీ, ఇటీవల పరిస్థితులు మారాయి. ఇప్పుడు భారత్‌కు ఉప్పల్‌ ఒక గెలుపు గ్రౌండ్‌. గత రెండు మ్యాచ్‌ల్లో భారత్‌ విజయకేతనం ఎగురవేసింది. మరికాసేపట్లో ఉప్పల్‌ వేదికగా భారత్‌ - ఆస్ట్రేలియా మధ్య వన్డే మ్యాచ్‌ మొదలవబోతోంది. ఈ నేపథ్యంలో ఉప్పల్‌లో ఇప్పటివరకు జరిగిన వన్డే మ్యాచ్‌లు వాటి ఫలితాలు గురించి ఓ సారి చూద్దాం!

ఉమేశ్‌... గబ్బర్‌...

ఉప్పల్‌లో భారత్‌ చివరి వన్టే శ్రీలంకతో  2014లో ఆడింది. ఇందులో తొలుత బ్యాటింగ్‌ చేసిన శ్రీలంక... భారత్‌ బౌలర్ల ధాటికి 242 పరుగులకే సరిపెట్టుకుంది. నాలుగు వికెట్లతో ఉమేశ్‌ యాదవ్‌ అదరగొట్టాడు. సిరీస్‌లో భీకరమైన ఫామ్‌లో ఉన్న శిఖర్‌ ధావన్‌ (91) మరో మంచి ఇన్నింగ్స్‌తో సులువుగా జట్టుని గెలిపించాడు. ఈ సిరీస్‌ని భారత్‌ 5-0తో క్లీన్‌ స్వీప్‌ చేసింది. రోహిత్‌ 264 పరుగుల మెరుపు ఇన్నింగ్స్‌ ఈ సిరీస్‌లోదే. అన్ని ఫార్మాట్స్‌లో కలిపి శ్రీలంకపై 100 విజయాలు సాధించింది ఈ సిరీస్‌తోనే.

 

మహీ మాయ...

భారత్‌, ఇంగ్లండ్‌ల ఐదు వన్డేల సిరీస్‌ 2011లో ఉప్పల్‌ మ్యాచ్‌తోనే ఆరంభమైంది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్‌కు దిగిన భారత్‌ ఏడు వికెట్లు కోల్పోయి 300 పరుగులు సాధించింది.  ఈ మ్యాచ్‌లో ధోని తనదైన శైలిలో బ్యాట్‌ ఝళిపిస్తూ అజేయంగా 87 పరుగులు చేశాడు. అనంతరం భారత బౌలర్లు సమష్టిగా రాణించి ఇంగ్లండ్‌ను 174 పరుగులకే కట్టడి చేశారు. ఈ సిరీస్‌లో భారత్‌కు ఇదే అతిపెద్ద విజయం. ఈ సిరీస్‌ని కూడా టీమిండియా 5-0తో క్లీన్‌స్వీప్‌ చేయడం విశేషం.

 

వారెవ్వా సచిన్‌!

అది 2009... ఏడు వన్డే సిరీస్‌లో భారత్‌, ఆసీస్‌ 2-2తో సమానంగా ఉన్నాయి. సిరీస్‌లో అప్పటికే రెండు మ్యాచ్‌ల్లో స్వల్ప తేడాతో ఓటమి పాలైన భారత్‌... ఉప్పల్‌ మ్యాచ్‌లో గెలిచి సిరీస్‌లో పైచేయి సాధించాలని భావించింది. తొలుత బ్యాటింగ్‌ చేసిన ఆస్ట్రేలియా 4 వికెట్లు కోల్పోయి 350 పరుగుల భారీ స్కోరు సాధించింది. అనంతరం బ్యాటింగ్‌కు దిగిన భారత్‌ 162 పరుగులకే నాలుగు వికెట్లు కోల్పోయింది. మరోవైపు సచిన్‌ ఒంటరి పోరు చేశాడు. 19 ఫోర్లు, 4 సిక్సర్లతో సచిన్‌ 175 పరుగులు సాధించాడు. ఈ ఇన్నింగ్స్‌తో భారత్‌ విజయంపై ఆశలు రేగాయి. విజయం కోసం 18 బంతుల్లో 19 పరుగులు మాత్రమే చేయాల్సి వచ్చింది. ఈ సమయంలో సచిన్‌ ఔటయ్యాడు. మరోవైపు ఆఖరి నమ్మకం జడేజా కూడా ఔటయ్యాడు. దీంతో భారత్‌ మూడు పరుగుల స్వల్ప తేడాతో ఓడింది. ఈ సిరీస్‌ని ఆసీస్‌ 4-2 తేడాతో కైవసం చేసుకుంది.

 

యువరాజ్‌ రాణించినా... 

ఆస్ట్రేలియాతో 2007లో జరిగిన సిరీస్‌లో ఓటమితో ఉప్పల్‌లో అడుగుపెట్టిన భారత్‌కు మరోసారి నిరాశే మిగిలింది. ఆండ్రూ సైమండ్స్‌, మాథ్యూ హెడెన్‌ రాణించడంతో తొలుత బ్యాటింగ్‌ చేసిన కంగారూలు 290 పరుగులు చేశారు. అనంతరం బ్యాటింగ్‌కు దిగిన భారత్‌ 243 పరుగలకే కుప్పకూలింది. యువరాజ్‌ (121) ఒక్కడే విజయం కోసం చివరి వరకు పోరాడాడు. ఈ సిరీస్‌ని ఆసీస్‌ 4-2 తేడాతో కైవసం చేసుకుంది.

 

పఠాన్‌తో కలసి... 

ఐదు వన్డేల దక్షిణాఫ్రికా సిరీస్‌లో భాగంగా 2005లో మొదటి మ్యాచ్‌ ఉప్పల్‌లో జరిగింది. తొలుత బ్యాటింగ్‌కు దిగిన భారత్‌ 35 పరుగులకే సగం వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది.  ఇర్ఫాన్‌ పఠాన్‌ (46) సహాయంతో యువరాజ్‌ సింగ్‌ (103) జట్టుని ఆదుకున్నారు. యువరాజ్‌ సెంచరీతో భారత్‌ 249 పరుగులు చేసింది.  అనంతరం బ్యాటింగ్‌కు వచ్చిన సౌతాఫ్రికా సమష్టిగా రాణించి విజయాన్ని సొంతం చేసుకుంది. ఈ సిరీస్‌ని  భారత్‌  2-2తో ముగించింది.

ఉప్పల్‌ మైదానంలో భారత్‌ - ఆస్ట్రేలియా మధ్య ఇప్పటివరకు రెండు మ్యాచ్‌లు జరిగాయి. ఆ రెండింటిలోనూ ఆసీసే విజయం సాధించి భారత్‌పై 2-0 ఆధిక్యంతో ఉంది. అయితే అదంతా గతం. ఇప్పుడు భారత్‌ సూపర్‌ ఫామ్‌లో ఉంది. టీమిండియా బ్యాట్స్‌మన్‌, బౌలర్లు మంచి ఊపు మీదున్నారు. ఈ నేపథ్యంలో ఈ రోజు జరగబోయే మ్యాచ్‌ మీద భారీ అంచనాలు ఉన్నాయి. మరోవైపు ఇటీవల టీ20 సిరీస్‌లో ఓటమితో కసి మీదున్న భారత్‌ ఈ మ్యాచ్‌లో విజయంతో సిరీస్‌ ఆరంభించాలని చూస్తోంది.

Source : Eenadu