జగన్‌ ధ్యాసంతా ప్యాలెస్‌లపైనే ప్రజాసేవ పట్ల చిత్తశుద్ధి లేదు : చంద్రబాబు

Apcm 1774
PTI | Updated :February 27, 2019,06:54 IST

వైకాపా పేదల పార్టీ కాదని.. ప్యాలెస్‌ల పార్టీ అంటూ ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు విమర్శించారు. హైదరాబాద్ వీడి జగన్మోహన్ రెడ్డి రాలేదని.. ప్యాలెస్‌ ఉంటే తప్ప ఇక్కడ నివసించలేరని దుయ్యబట్టారు. ఎక్కడికి వెళ్లినా రాజ ప్రసాదాల్లోనే జగన్ బస చేస్తారని విమర్శించారు. లోటస్ పాండ్, బెంగళూరు ప్యాలెస్‌, పులివెందుల ప్యాలెస్‌లకు తోడు ఇప్పుడు అమరావతిలో ఇంకో ప్యాలెస్‌ ఏర్పడిందన్నారు. జగన్‌ ధ్యాసంతా ప్యాలెస్‌లపైనే ఉందని.. ప్రజాసేవ పట్ల చిత్తశుద్ది లేదని విమర్శించారు. ప్రజాప్రతినిధులు, బూత్ కన్వీనర్లు, పార్టీ బాధ్యులతో చంద్రబాబు టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు.

 
రాజధాని విషయంలో వైకాపా ప్రజల్లో అనుమానాలు సృష్టిస్తోందని మండిపడ్డారు. అందరికీ అందుబాటులో రాష్ట్రం నడిబొడ్డున ఉన్న అమరావతిపై ప్రజల్లో అపోహలు పెంచుతారా? అని ప్రశ్నించారు. ఇప్పుడు వైకాపా తన మేనిఫెస్టోలో రాజధాని ఎక్కడ అనే అంశం పెట్టి తన దుర్బుద్ధిని బయటపెట్టిందని మండిపడ్డారు. విశాఖలో మోది సభకు వైకాపా జనాన్ని తరలిస్తోందని.. గుంటూరు సభకు కూడా జనాన్ని తరలించిందని చెప్పారు. మార్చి 1న ప్రధాని మోదీ విశాఖ రాకను నిరసిస్తూ ప్రత్యేక హోదా సాధన సమితి ఐకాస ఆందోళనలకు పార్టీ పూర్తి మద్దతు ఉంటుందని సీఎం తెలిపారు.

Source : Eenaadu