అమర జవాన్ల కుటుంబాలకు సచిన్ బాసట

Sachin
PTI | Updated :February 21, 2019,19:16 IST

పుల్వామా ఉగ్రదాడిలో ప్రాణాలు విడిచిన అమర వీరుల కుటుంబాలను ఆదుకునేందుకు క్రికెట్‌ దిగ్గజం సచిన్ తెందూల్కర్ తనవంతు చేయూత అందించబోతున్నాడు. ఐడీబీఐ ఫెడరల్‌ లైఫ్‌ ఇన్సూరెన్స్‌ ఆధ్వర్యంలో దిల్లీలో ఆదివారం జరగనున్న ‘మారథాన్’ ద్వారా అమర జవాన్ల కుటుంబాలకు విరాళాలను సేకరించాలని కంపెనీ భావిస్తోంది. వేలాది మంది పాల్గొనే ఈ మారథాన్‌లో సచిన్‌ కూడా పాల్గొననున్నారు. అయితే ఈ మారథాన్‌ ప్రారంభానికి ముందు ‘కీప్ మూవింగ్‌ పుష్‌-అప్’ ఛాలెంజ్‌లో భాగంగా సచిన్ అయిదు నుంచి పది పుష్‌ అప్‌లను చేయనున్నట్లు తెలుస్తోంది.

ఈ ఛాలెంజ్‌లో సచిన్‌తోపాటు మారథాన్‌లో పాల్గొనటానికి వచ్చిన రన్నర్స్‌ కూడా పాల్గొననున్నారు. ఛాలెంజ్‌లో పాల్గొన్న ప్రతి ఒక్కరికి వంద రూపాయలను ఐడీబీఐ ఫెడరల్‌ లైఫ్‌ ఇన్సురెన్స్‌, మారథాన్‌ నిర్వాహకులు అందించనున్నారు. అనంతరం ఈ రుసుమును అమరుల కుటుంబాలకు విరాళంగా రన్నర్ల నుంచి స్వీకరించనున్నారు. దాదాపు ఈ మారథాన్‌లో 18,000 మంది రన్నర్లు పాల్గొనవచ్చని నిర్వాహకులు అంచనా వేస్తున్నారు. ‘కీప్‌ మూవింగ్‌ పుష్‌-అప్’ ఛాలెంజ్‌లో చాలా మంది పాల్గొని తమ నిబద్ధత చాటుకోవాలని ఐడీబీఐ బ్రాండ్‌ అంబాసిడర్‌ సచిన్‌ తెందూల్కర్ కోరారు.

 

Source: Eenadu