90% హామీలను నెరవేర్చాం మోసం చేసే ప్రవృత్తి ఏపీ ముఖ్యమంత్రిదే

21ap main3a 4
PTI | Updated :February 22, 2019,05:03 IST


కశ్మీర్‌లో ఉగ్రదాడిని కాంగ్రెస్‌ రాజకీయం చేయాలని చూస్తోందని భాజపా జాతీయ అధ్యక్షుడు అమిత్‌షా ధ్వజమెత్తారు. కశ్మీర్‌ సమస్యకు నాటి ప్రధాని జవహర్‌లాల్‌ నెహ్రూ కారణం కాదా..? అని ప్రశ్నించారు. సర్దార్‌ వల్లభ్‌భాయ్‌ పటేల్‌ హైదరాబాద్‌ను దేశంలో విలీనం చేసిన మహనీయుడని, ఆయనే ప్రధానిగా ఉంటే కశ్మీర్‌ సమస్య తలెత్తేది కాదన్నారు. ఆ విషయాన్ని కాంగ్రెస్‌ నేతలు గుర్తించాలని హితవు పలికారు. తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరంలో గురువారం భాజపా నిర్వహించిన సభలో అమిత్‌షా ప్రసంగించారు. సైనికుల్లో ఆత్మస్థైరాన్ని నింపేలా ప్రధాని మోదీ చూస్తుంటే విమర్శించడం సరికాదన్నారు. ఉగ్రదాడులకు, పాకిస్థాన్‌కు సంబంధం లేదని ఆ దేశ ప్రధాని ఇమ్రాన్‌ఖాన్‌ అంటుంటే ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు దానికి మద్దతు పలుకుతున్నారని ధ్వజమెత్తారు. ‘చంద్రబాబుకు పక్క దేశ ప్రధాని మీద ఉన్న నమ్మకం మన ప్రధానిపై లేదు. మా రక్తంలో దేశభక్తి ఉంది. ఈ విషయంలో మమ్మల్ని విమర్శించే నైతిక హక్కు ఎవరికీ లేదు. మేం అధికారాన్ని చేపట్టిన తరువాత దేశ రక్షణకు ప్రాధాన్యం ఇచ్చాం. గతంలో జరిగిన ఉగ్రదాడులను సమర్థంగా తిప్పికొట్టాం. ఆయా రాష్ట్రాలకు వెళ్లి దీక్షలు చేయడంపై దృష్టి పెడుతున్న చంద్రబాబు ఆంధ్రప్రదేశ్‌ మీద మాత్రం దృష్టి పెట్టడం లేదు’ అని ఆయన విమర్శించారు. 
జగన్‌, చంద్రబాబుల వల్ల అభివృద్ధి సాధ్యం కాదని, అది తమ ప్రభుత్వంతోనే సాధ్యమని అమిత్‌షా చెప్పారు. ‘చంద్రబాబుది మోస ప్రవృత్తి. ఎన్టీఆర్‌కు ఆయన వెన్నుపోటు పొడిచారు. గతంలో వాజ్‌పేయీని, ఇప్పుడు ప్రధాని మోదీని మోసం చేశారు. చంద్రబాబు, జగన్‌లు వారి కుటుంబాల అభివృద్ధి కోసమే పాటుపడతారు తప్ప రాష్ట్రం కోసం కాదు. ప్రజలు ప్రతి విషయాన్ని గమనిస్తున్నారు.’ అని తెలిపారు. రాబోయే ఎన్నికల్లో భాజపాను అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరారు. విభజన చట్టంలోని 14 అంశాల్లో పదింటిని పూర్తి చేశామని స్పష్టంచేశారు. ఏపీలో ఐఐటీ, ఎన్‌ఐటీ, ఐఐఎస్‌ఈఆర్‌, కేంద్ర/ గిరిజన/ వ్యవసాయ విశ్వవిద్యాలయాలు, ఎయిమ్స్‌, ఆహార పరిశ్రమల సముదాయం, విశాఖ-చెన్నై పారిశ్రామిక నడవా, 8800 మెగావాట్ల విద్యుదుత్పత్తి కేంద్రం, రాజధానిని అనుసంధానించేలా విశాఖ, తిరుపతి, విజయవాడ అంతర్జాతీయ విమానాశ్రయాలు వంటి పనులన్నీ మోదీ నాయకత్వంలో అమలుచేశామని వివరించారు. 

నిధులిస్తే దుర్వినియోగం చేశారు 

దేశంలోని ఏ రాష్ట్రానికి ఇవ్వనన్ని నిధులు ఆంధ్రప్రదేశ్‌కు ఇచ్చామని అమిత్‌ షా తెలిపారు. అమరావతి, పోలవరం నిర్మాణాలకు నిధులిచ్చామని చెప్పారు. వనరులు, నిధులు ఇస్తే ముఖ్యమంత్రి చంద్రబాబు వాటిని దుర్వినియోగం చేశారని ఆరోపించారు. ఇంత అభివృద్ధి చేస్తున్నా తాము సహకరించడం లేదనడానికి నైతిక హక్కు ఎక్కడుందని సీఎంను ప్రశ్నించారు. అనంతరం రాజమహేంద్రవరం, నర్సాపురం, అమలాపురం, కాకినాడ, ఏలూరు పార్లమెంటు నియోజకవర్గాల శక్తి కేంద్రాల ప్రముఖులు, బూత్‌ ఇన్‌ఛార్జిలతో సమావేశమై పలు అంశాలను చర్చించారు. అంతకు ముందు రాజమహేంద్రవరంలో పర్యటించిన అమిత్‌షా స్థానిక క్వారీ మార్కెట్‌ సమీపంలో ఏర్పాటు చేసిన పార్టీ కార్యాలయాన్ని ప్రారంభించారు. ‘ప్రధాన మంత్రి ఆవాస యోజన’ కింద నిర్మించిన ఇంటిని ప్రారంభించారు. స్థానికులతో కాసేపు మాట్లాడారు. ఈ కార్యక్రమాల్లో భాజపా రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ, ఎమ్మెల్సీ సోము వీర్రాజు, కేంద్ర మాజీ మంత్రి పురందేశ్వరి, పార్టీ జాతీయ అధికార ప్రతినిధి జీవీఎల్‌ నరసింహారావు, మాజీ మంత్రి మాణిక్యాలరావు, మాజీ ఎంపీ కావూరి సాంబశివరావు పాల్గొన్నారు.

మహా కూటమిలో అందరూ ప్రధానులే: అమిత్‌ షా

ఈనాడు డిజిటల్‌, బెంగళూరు: భాజపాకు వ్యతిరేకంగా ఏర్పాటు కానున్న మహా కూటమిలో ప్రతి ఒక్కరూ ప్రధానమంత్రి అభ్యర్థులేనంటూ భాజపా జాతీయాధ్యక్షుడు అమిత్‌ షా ఎద్దేవా చేశారు. గురువారం బెంగళూరులో భాజపా కర్ణాటక రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో ఆయన మాట్లాడుతూ- మహా కూటమికి స్పష్టమైన లక్ష్యం లేదన్నారు. ‘...వారి ముందున్న లక్ష్యం పీఎం కావటమే. దేవెగౌడ కూడా ప్రధాని కావాలని కలలు కంటున్నారు. భాజపాయేతర పార్టీలన్నీ కులాలను ఆధారంగా చేసుకుని పని చేస్తే, మనం బూత్‌స్థాయి కార్యకర్తలతో కలిసి పని చేస్తాం. సురక్షితమైన ప్రభుత్వం కావాలో, అవకాశవాద ప్రభుత్వం కావాలో తేల్చుకోవాలి’ అని ఆయన చెప్పారు. ప్రభుత్వ పనితీరును ప్రశ్నించే రాహుల్‌గాంధీకి గణితం తెలియదన్నారు. 55 ఏళ్ల పాలనలో కాంగ్రెస్‌ చేపట్టలేని అభివృద్ధిని నాలుగున్నరేళ్లలో ఎన్‌డీఏ చేసిందన్నారు. తమతో పోటీ పడే శక్తి మహా కూటమికి లేదన్నారు. భాజపా రాష్ట్ర అధ్యక్షుడు యడ్యూరప్ప, కేంద్ర మంత్రి సదానందగౌడ పాల్గొన్నారు.

Source : Eenadu