ఇంకెక్కడా పాక్‌తో మ్యాచులొద్దు టీమిండియా మాజీ కెప్టెన్‌ అజహరుద్దీన్‌

Md azhar
PTI | Updated :February 21, 2019,05:58 IST

 మరి కొన్ని రోజుల్లో ప్రారంభం కానున్న ప్రపంచ కప్‌లో భారత్‌-పాక్‌ మ్యాచ్‌ రద్దు చేయాలనే ప్రతిపాదనపై భిన్న స్వరాలు వినిపిస్తున్నాయి. ఇప్పటికే దీనిపై మాజీ క్రికెటర్‌ చేతన్‌ చౌహాన్ స్పందించగా, తాజాగా మాజీ కెప్టెన్‌, కాంగ్రెస్‌ నేత అజహరుద్దీన్‌ స్పందించారు.

‘పాకిస్థాన్‌తో టీమిండియా ఏ టోర్నీలోనూ ఆడకూడదు. నేను హర్భజన్‌తో ఏకీభవిస్తున్నాను. దేశ ప్రజల మనోభావాల కంటే ప్రపంచ కప్‌ ఎక్కువకాదు. మన జవాన్ల కుటుంబాలను చూసి మనం ఇక్కడ కన్నీరు పెడుతుంటే పాకిస్థాన్‌ కనీసం జాలి కూడా చూపించడం లేదు. ఎన్నో దేశాలు పుల్వామా ఘటన అనంతరం మనకు అండగా ఉంటామని చెప్పాయి. కానీ పాక్‌ మాత్రం కనీసం పలకరించలేదు. అలాంటి దేశ జట్టుకు మనతో ఆడే అర్హత లేదు. మనం ఇక్కడ క్రికెట్‌ మ్యాచ్‌ గెలిస్తే జవాన్లు అక్కడ సంబరాలు చేసుకుంటారు. క్రికెట్‌కు వాళ్లు అంత గౌరవం ఇస్తున్నప్పుడు మనం దాన్ని కాపాడుకోవాలి. ఇండియా-పాక్‌ జట్ల మధ్య ద్వైపాక్షిక సిరీస్‌ జరగకపోతే ఇంకెక్కడా ఈ రెండు జట్ల మధ్య మ్యాచ్‌లు ఉండకూడదు. ఐసీసీ, బీసీసీఐ ఈవిషయంపై వీలైనంత త్వరగా ఏదో ఒక నిర్ణయం తీసుకోవాలి’ అని తెలిపారు.

Source : Eenadu