పాక్‌జట్టు జ్ఞాపకాలను తొలగించిన బీసీసీఐ

Bcci 1
PTI | Updated :February 21, 2019,05:53 IST

 పుల్వామా ఉగ్రదాడి నేపథ్యంలో పాక్‌‌పై బీసీసీఐ గుర్రుమంటోంది. ఇప్పటికే ప్రపంచకప్‌లో భారత్‌-పాక్‌ మ్యాచ్‌ను రద్దు చేసేందుకు సన్నాహాలు చేస్తోంది. దీంతోపాటు దాడికి నిరసనగా పాకిస్థాన్‌ ప్రధాని, మాజీ క్రికెటర్‌ ఇమ్రాన్ ఖాన్‌ చిత్రపటాల్ని వివిధ స్టేడియాల్లో తొలగించిన విషయం తెలిసిందే. తాజాగా బీసీసీఐ పాకిస్థాన్‌ జట్టుకు సంబంధించిన జ్ఞాపకాలను తొలగించింది. ముంబయిలోని బీసీసీఐ ముఖ్యకార్యాలయంలో పాకిస్థాన్‌కు సంబంధించిన ముఖ్యఘట్టాలన్నింటికీ సంబంధించిన గ్యాలరీని తొలగించింది.

పుల్వామా ఘటనలో అమరులైన జవాన్లకు నివాళిగా వాటిని తొలగించినట్లు బీసీసీఐ అధికారులు తెలిపారు. వీటిస్థానంలో భారత క్రికెట్‌ చరిత్రకు సంబంధించిన ముఖ్య ఘట్టాలు, క్రికెటర్ల చిత్ర పటాలు దర్శనమివ్వనున్నాయి. ఈ కార్యాలయంలో మొదటి అంతస్తులో ప్రపంచ వ్యాప్తంగా చారిత్రక టోర్నీలు ఆడిన వారి బ్యాటులను ప్రదర్శనకు ఉంచారు. ఇందులో పాకిస్థాన్‌ క్రికెటర్ల ఆటోగ్రాఫ్‌లున్న బ్యాటులు కూడా ఉన్నాయి. ప్రస్తుతం వీటిని తొలగించారు.

Source : Eenadu