కడసారి నీకు.. కన్నీటితో ఐ లవ్యూ

19brk major
PTI | Updated :February 19, 2019,20:27 IST

దేశ రక్షణలో ప్రాణత్యాగం చేసిన భర్తకు కన్నీటితో వీడ్కోలు పలికింది ఆ వీరజవాను భార్య. గుండె పగిలె బాధను పంటిబిగువ పట్టి చివరిసారిగా భర్తకు ముద్దు పెట్టింది. ఐ లవ్యూ అంటూ ప్రేమను వ్యక్తపర్చింది. ఈ హృదయ విదారక దృశ్యాన్ని చూసి అక్కడున్న వారంతా చలించిపోయారు.

పుల్వామాలో సోమవారం జరిగిన ఎదురుకాల్పుల్లో మేజర్‌ విభూతి శంకర్‌ డౌండియాల్‌, మరో ముగ్గురు జవాన్లు ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే. డౌండియాల్‌ పార్థివదేహాన్ని నేడు స్వగ్రామానికి తీసుకొచ్చారు. భర్త మరణవార్త తెలియగానే డౌండియాల్‌ భార్య నికితా కౌల్‌ గుండె బద్ధలైంది. అయినప్పటికీ ఆ బాధను దిగమింగుకుని వీర జవానుకు ఘన నివాళి అర్పించారు. డౌండియాల్ భౌతికకాయం పక్కన కూర్చున్న నికిత భర్తకు చివరిసారిగా ముద్దు ఇచ్చారు. ఐ లవ్యూ అంటూ కన్నీటి వీడ్కోలు పలికారు. ఈ దేశం కోసం తన భర్త చేసిన త్యాగాన్ని చూసి గర్వపడుతున్నానని నికిత ఈ సందర్భంగా చెప్పారు.

మేజర్‌ డౌండియాల్‌, నికితల వివాహం గతేడాది ఏప్రిల్‌లో జరిగింది. తొలి వివాహ వార్షికోత్సవాన్ని కుటుంబసభ్యులతో జరుపుకోవాలని మేజర్‌ దంపతులు ఎంతో ఆశపడ్డారు. పెళ్లి రోజు నాటికి సెలవు తీసుకుని ఇంటికి వస్తానని డౌండియాల్‌ భార్యతో చెప్పారు. ఇంతలోనే ఈ విషాధ ఘటన చోటుచేసుకుంది.

 

Source: Eenadu